సద్వినియోగం చేసుకోవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో నీటి కొరత, ఎద్దడిని అధిగమించేందుకు, ఉద్యాన పంటల సాగులో అధిక ఉత్పాదకత సాధించేందుకు డ్రిప్ నీటిపారుదల ఆటోమేషన్ సాంకేతికతను ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. ఈ పద్ధతి ద్వారా రైతులకు సమయం ఆదా, శ్రమ, ఖర్చును తగ్గించడంతో పాటు పంటల నిర్వహణ సులభతరంగా ఉంటుంది. మొబైల్ ఫోన్ లేదా కంట్రోలర్ సహాయంతో పంటలకు సాగునీటిని అందించవచ్చు. నిర్ణీత సమయాలలో పంటలకు అవసరమైన మేరకు నీరు అందడం వల్ల నీటి వినియోగంలో 30 నుంచి 40 శాతం వరకు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్యాన శాఖ హెక్టారుకు యూనిట్ ధర రూ.40 వేలుగా నిర్ణయించింది. చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 55 శాతం సబ్సిడీతో రూ 22 వేలు, పెద్ద రైతులకు 45 శాతం సబ్సిడీతో రూ. 18 వేలు రాయితీ లభిస్తుంది. ఆర్‌కేవీవై, పీడీఎంసీ పథకం ద్వారా సబ్సిడీ అందుతుంది. ఇప్పటికే డ్రిప్ వ్యవస్థ కలిగిన రైతులు కూడా ఆటోమేషన్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని సబ్సిడీ పొందవచ్చని ఉద్యాన శాఖాధికారులు తెలిపారు.
ఉద్యానశాఖ ద్వారా రైతులకు రాయితీ
డ్రిప్ ఆటోమేషన్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రాయితీలను వినియోగించుకుని ఆటో మేషన్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని నాణ్యమైన దిగుబడులు పొందాలి. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. –జంగ కిషోర్,
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి


