భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న వైదిక పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆదివారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని కాచిగూడ బర్మత్‌పురా ప్రాంతంలోని తుల్జా భవన్ ధర్మశాలలో అభ్యర్థులకు ఈ నెల 13న రాత, మౌఖిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తులను భద్రాచలంలోని తానీషా కల్యాణ మండపంలోని కార్యాలయంలో స్వీకరించారు. పరిశీలించి అభ్యర్థులకు హాల్ టికెట్లను అందించారు. మొత్తం 22 పోస్టులు ఉండగా, 121 మంది దరఖాస్తులు సమర్పించారు. తొలి రోజు అఽధికారులు 28 దరఖాస్తుల ఒరిజనల్ పత్రాలను పరిశీలించారు. మరో రెండు రోజులు పరిశీలన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ, అనిల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రామయ్యకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన
దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
రామయ్యకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన


