మాకు బైక్ లేదు..కారు లేదు
జనగణనలో విస్తుపోయే
వివరాలు
రేషన్‌కార్డులు, పింఛన్లు రద్దవుతాయని తప్పుడు ప్రచారాలు
బూర్గంపాడు: మణుగూరు పట్టణంలో త్రిబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి ‘ఈ ఇల్లు మాది కాదు, మాకు బైక్ లేదు, కారు లేదు’అని జనగణనకు వచ్చిన ఎన్యూమరేటర్లకు తెలిపారు. ఆ ఇంట్లో ఉంటున్నది ఆ కుటుంబం మాత్రమే. అయితే ఆ ఇంట్లో కారు ఉంది, బైక్ ఉంది. అవి మావి కావని జనగణనకు వచ్చిన వారికి సమాచారమిచ్చారు. ఇంట్లో ఉన్న కారు, బైక్ వేరేవాళ్లవని సమాచారమివ్వటంతో ఎన్యుమరేటర్లు విస్తుపోయారు. వారు చెప్పిన సమాచారాన్నే ఎన్యుమరేటర్లు నమోదు చేసుకున్నారు.
అంతా తప్పుడు సమాచారం?
బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన 20 ఎకరాల ఆసామికి ట్రాక్టర్, కారు ఉన్నాయి. అయితే ఎన్యూమరేటర్లకు మాత్రం తనకు బైక్ తప్ప ఇతర వాహనాలు ఏమి లేవని సమాచారమిచ్చా రు. తండ్రి, కొడుకు కలిసి ఉంటున్న ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నామని రెండు కుటుంబాల వివరాలను వేర్వేరుగా నమోదు చేయించారు. సారపాక పట్టణంలో ఉంటున్న ఐటీసీ పర్మనెంట్ కార్మికుడు తనకు ఇల్లు లేదని, అద్దె ఇంట్లో ఉంటున్నామని, కనీసం గ్యాస్ కనెక్షన్ కూడా లేదని ఎన్యూమరేటర్లకు తప్పుడు సమాచారమిచ్చారు. వాస్తవానికి ఆ ఇల్లు అతనిదేనని, తనకు ఇటీవలే వచ్చిన రేషన్‌కార్డు రద్దవుతందనే భయంతోనే తప్పుడు సమాచారమిచ్చాడని తెలుస్తోంది.
పథకాలు రద్దవుతాయనే..
ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభు త్వం జనగణన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే జనగణన చేస్తున్న ఎన్యుమరేటర్లు మాత్రం ప్రజల నుంచి వస్తున్న సమాధానాలతో విస్తుపోతున్నారు. పక్కా బిల్డింగ్‌లో నివాసముంటున్నా అది మాది కాదని, కారు, బైక్ ఉన్నా అవి మావి కావని చెబుతున్నారు. కొందరైతే గ్యాస్ కనెక్షన్ కూడా లేదని చెప్పడం గమనార్హం. ఎన్యూమరేటర్లు ప్రభుత్వం తమకు ఇచ్చిన 34 ప్రశ్నలను ప్రతీ ఇంటికి వెళ్లి అడిగి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇళ్లలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు వారు చెప్పే సమాధానాలకు పొంతన లేకుండా ఉంటున్నా యి. వాస్తవాలు చెప్పాలని ఎన్యుమరేటర్లు ఎంత మొత్తుకున్నా కొందరు మాత్రం తమకు ప్రభుత్వ పథకాలు దూరమవుతాయనే భయంతో వాస్తవాలను దాచిపెడుతున్నారు.
అందులో వాస్తవం లేదు..
పక్కా బిల్డింగ్ ఉందన్నా, కారు, బైక్ ఉందన్నా ప్రభుత్వ పథకాలు దూరమవుతాయనే తప్పుడు ప్రచారంతో కొందరు జనగణనలో తప్పుడు సమాచారమిస్తున్నారు. అధికారులు, ఎన్యుమరేటర్లు వాస్తవాలు చెప్పండని, ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ఢోకా ఉండదని ఎంత చెప్పినా కొందరు మాత్రం తమకు ఏమి లేవని చెబుతున్నారు. ముఖ్యంగా రేషన్‌కార్డులు రద్దవుతాయని దీంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలు రావని కొందరిలో భయాందోళనలున్నాయి. రేషన్‌కార్డు అన్ని ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో దానినికాపాడుకునేందుకు తప్పుడు సమాచారమిస్తున్నట్లు తెలుస్తోంది. బైక్, కారు,ట్రాక్టర్ ఉందంటే పింఛన్లు రద్దవుతాయని, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ రాదనే భ్రమ కొందరిలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణనలో ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మాత్రం పూర్తిస్థాయిలో వాస్తవాలు వెలుగులోకి రావటం లేదనేది వాస్తవం.


