అదిరేటి స్టెప్పులతో ఆకట్టుకుంటున్న చిన్నారులు
వేసవి సెలవుల్లో ప్రతిభకు పదును
ఏకాగ్రత పెరుగుతుంది..
సత్తుపల్లిటౌన్: అదిరేటి స్టెప్పులతో అదుర్స్ అన్పిస్తున్నారు చిన్నారులు. శరీరాన్ని మెలికలు తిప్పుతూ ఆకట్టుకుంటున్నారు. వేసవి సెలవుల్లో సత్తుపల్లిలోని కళాభారతిలో నృత్య శిక్షణ శిబిరం కొనసాగుతుండగా, ఉత్సాహంగా సాధన చేస్తూ చిన్నారులు ప్రతిభ మెరుగుపర్చుకుంటున్నారు.
ఉల్లాసంగా, ఉత్సాహంగా..
కళాభారతిలో శిక్షణకు సుమారు వంద మంది చిన్నారులు హాజరవుతున్నారు. ఇద్దరు డ్యాన్స్ మాస్టర్ల పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతుండగా, సినిమా పాటలకే కాక జానపద గేయాలకు సైతం లయబద్ధంగా అడుగులేస్తూ పిల్లలు ఔరా అనిపిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్లు తమ్మిశెట్టి గణేశ్‌బాబు, జి.మంజూష ప్రత్యేక శ్రద్ధతో మెళకువలు నేర్పిస్తుండగా, ఇప్పటికే నెల దాటడంతో పిల్లలు డ్యాన్స్‌లో ప్రావీణ్యం సాధించారు. పిల్లలు సెల్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా నృత్యంలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పంపిస్తూ ప్రోత్సహిహిస్తున్నారు. నృత్యం సృజనాత్మక శక్తిని పెంచడమే కాక శారీకక ఆరోగ్యం, ఏకాగ్రతను పెంచుతుందని మాస్టర్లు చెబుతున్నారు.
ఈ సంవత్సరం నుంచే డ్యాన్స్ క్లాస్‌లకు వస్తున్నా. చాలా ఇష్టంగా ఈ వేసవి సెలవులను డ్యాన్స్ నేర్చుకునేందుకు సద్వినియోగం చేసుకుంటున్నా. అందరం పోటీ పడి నృత్యం నేర్చుకుంటున్నాం.
–జె.అధర్వరిషి. 3వ తరగతి, సత్తుపల్లి
మూడేళ్ల నుంచి ఈ కళాభారతిలో డ్యాన్స్ నేర్చుకుంటున్నా. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. జానపదం, సినిమా పాటలకు నృత్యాన్ని మాస్టర్ నేర్పిస్తున్నారు. ఈ సెలవుల్లో మరింత తర్ఫీదు పొందాను.
–దోమ హెబ్సిబా, 4వ తరగతి, సత్తుపల్లి
కళాభారతిలో టీచర్ మంచిగా నేర్పుతున్నారు. సినిమా పాటలే కాక జానపద నృత్యాలకు కూడా నేర్పిస్తున్నారు. నాకు జానపద నృత్యాలు వచ్చాయి. పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో ప్రదర్శన ఇస్తా.
–రామాల జెన్సీ, 4వ తరగతి, సత్తుపల్లి
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నారులు డ్యాన్స్ నేర్చుకునేందుకు వస్తున్నారు. పిల్లలు ఉత్సాహంగా నేర్చుకోవడమే కాక ప్రావీణ్యం సాధించారు. చాలామంది అదిరేలా సెప్పులు వేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు.
–తమ్మిశెట్టి గణేశ్‌బాబు, డ్యాన్స్‌మాస్టర్, సత్తుపల్లి


