ఆర్టీసీపై అ‘ధనం’! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై అ‘ధనం’!

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

● డీజిల్‌ ధర పెరుగుదలతో భారం ● రీజియన్‌పై భారం రోజుకు రూ.4.25 లక్షలు.. ● పొదుపు చర్యల వేళ ధరలతో సతమతం

రీజియన్‌ పరిధిలో దూరాభారం ఇలా..

● డీజిల్‌ ధర పెరుగుదలతో భారం ● రీజియన్‌పై భారం రోజుకు రూ.4.25 లక్షలు.. ● పొదుపు చర్యల వేళ ధరలతో సతమతం

ఖమ్మంమయూరిసెంటర్‌: సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రవాణా సంస్థ టీజీఎస్‌ ఆర్టీసీపై డీజిల్‌ ధరల పెంపు పిడుగులా పడింది. ఇప్పటికే రకరకాల భారాలతో సతమతమవుతున్న సంస్థకు ఇటీవల రోజుల వ్యవధిలోనే డీజిల్‌ ధర లీటర్‌కు సుమారు రూ.9 మేర పెరగడం కోలుకోలేని దెబ్బతీసింది. ఖమ్మం రీజియన్‌లో ప్రాంతాల వారీగా రూ.96 నుండి రూ.97 వరకు ఉన్న లీటర్‌ డీజిల్‌ ధర ఇప్పుడు రూ.103.41 నుంచి రూ.105.08 వరకు చేరింది. ఫలితంగా ఆర్టీసీ చక్రాలు తిరగడం భారంగా మారింది.

కి.మీ.కు రూ.1.51 అదనం

ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో ఆర్టీసీ సొంత బస్సులతో పాటు అద్దె బస్సులు కలిపి ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రీజియన్‌ పరిధిలో ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి రోజుకు సగటున 2.82 లక్షల కి.మీ. మేర తిరుగుతున్నాయి. ధరల పెంపుతో కిలోమీటర్‌పై రూ.1.51 అదనపు భారం పడగా.. సంస్థ రోజువారీ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి.

నెలకు రూ.1.27 కోట్లు

డీజిల్‌ ధర పెరుగుదలతో ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌పై రోజుకు అదనంగా రూ.4,25,820 వెచ్చించాల్సి వస్తోంది. ఇది నెలకు రూ.1,27,74,600 గా నమోదవుతుందని అంచనా. ఉమ్మడి జిల్లాలోని డిపోల ఆదాయం అంతంతమాత్రంగానే సాగుతుంటే, మరోవైపు డీజిల్‌ భారం పడడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే లీటర్‌పై రూ.9 పెరగడం సంస్థకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. ప్రతీ రూపాయిని పొదుపు చేస్తూ రూట్లను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయాన ఇంధన ధరల పెంపు తమ అంచనాలను తలకిందులు చేస్తోందని అధికారులు చెబుతున్నారు.

ఆర్టీసీ, అద్దె బస్సులు తిరిగే దూరం 2.82 లక్షల కి.మీ.

ప్రతీ కిలోమీటర్‌పై అదనపు భారం రూ.1.51

రోజుకు.. రూ.4,25,820

నెలకు.. రూ.1,27,74,600

Advertisement
 
Advertisement
Advertisement