కరకగూడెం: ఒక గ్రామంలోని కిరాణా దుకాణంలో బట్ట సంచి, ప్లాస్టిక్ కవర్ పక్కపక్కనే ఉండేవి. ప్లాస్టిక్ కవర్ తన మెరుపును చూసుకుని గర్వపడేది. ‘నన్ను చూడు... తేలికగా ఉంటాను. అందరూ నన్నే తీసుకెళ్తారు. నువ్వు మాత్రం పాతకాలం వస్తువులా కనిపిస్తున్నావు’అని బట్ట సంచిని ఎగతాళి చేసేది. అందుకు బదులుగా బట్ట సంచి ‘సరైన సమయంలో వస్తువుల విలువ తెలుస్తుంది’అనేది. కాలక్రమంలో అవసరం తీరాక ప్లాస్టిక్ కవర్లను రోడ్ల వెంట, డ్రెయినేజీల్లో వేస్తుండడంతో కుప్పలు పేరుకుపోయాయి. ఓ రోజు భారీ వర్షం కురిసింది. గ్రామంలోని డ్రెయినేజీలు ప్లాస్టిక్ కవర్లతో నిండడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో గ్రామస్తులు ఇబ్బంది పడగా గ్రామ పెద్దలు సమావేశమై ‘ఈ ఇబ్బందికి కారణమైన ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలి’అని నిర్ణయించారు. మరుసటి రోజు నుంచి గ్రామంలో ప్రతిఒక్కరూ బట్ట సంచి ఉపయోగించడం ప్రారంభించారు. కాలక్రమంలో గ్రామం పరిశుభ్రంగా మారింది. కాల్వలు శుభ్రంగా ఉండడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లేది. అప్పుడు ప్లాస్టిక్ కవర్ ఒకసారి మాత్రమే ఉపయోగపడతాను. తర్వాత ప్రకృతికి భారంగా మారతాను.. కానీ నువ్వు ఎన్నోసార్లు ఉపయోగపడుతూ ప్రకృతిని కాపాడుతున్నావు. నిజంగా నువ్వే గొప్పదానివి’అని బట్ట సంచితో చెప్పింది. అందుకు బట్ట సంచి నవ్వుతూ ‘గొప్పతనం బయట కనిపించే అందంలో కాదు. ఇతరులు, ప్రకృతికి ఉపయోగపడడంలో ఉంటుంది’అని చెప్పింది. ఆ మాటలు విన్న కవర్ తన తప్పు తెలుసుకుంది.
నీతి: తాత్కాలిక సౌకర్యం కంటే ప్రకృతిని కాపాడే అలవాట్లే గొప్పవి. చిన్నచిన్న మార్పులే పర్యావరణాన్ని రక్షిస్తాయి.


