సంస్కృతి పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి పరిరక్షణ

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

విద్యా, ఇతర రంగాల్లో

సంప్రదాయాలను కాపాడేందుకు

ఐటీడీఏ పీఓ రాహుల్‌ కృషి

జాతీయ స్థాయిలో గుర్తింపు,

రూ.5 లక్షల నగదు పురస్కారం

కోయ భాష నేర్చుకుని

ఆదివాసీలతో మమేకం

గిరిజనంపై

మక్కువ..

భద్రాచలం: గిరిజనాభివృద్ధికి, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడుతున్న భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి బి.రాహుల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ నెల 3న ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన జాతీయ పీవోస్‌ కార్పొరేషన్‌లో దేశంలోనే ఉత్తమ ప్రాజెక్ట్‌ అధికారిగా నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అశోక్‌ కుమార్‌, ట్రైబల్‌ అఫైర్స్‌ మినిస్ట్రీస్‌ సెక్రటరీ రంజాన్‌ చోప్రా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. భద్రాచలం ఐటీడీఏ పీఓగా 2024 జూన్‌ 25న బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే రెండేళ్లు పూర్తి చేసుకునే క్రమంలో రూ. 5 లక్షల నగదు పురస్కారం అందుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సత్కారం పొందారు. గిరిజనులు, ఆదివాసీ సంఘాల నాయకులు, స్థానికులు కూడా అభినందిస్తున్నారు. గతంలో సైతం మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌గా పని చేసే సమయంలో బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును గవర్నర్‌ చేతుల మీదుగా, బెస్ట్‌ రూరల్‌ టూరిజం అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం భద్రాచలం పీఓగా పనిచేస్తున్న క్రమాన ఆదివాసీ గిరిజనుల ఐక్యవేదిక తరఫున ఆదివాసీ వికాసరత్న బిరుదు పొందారు.

గిరిజన మ్యూజియం విస్తరణ..

పీఓ రాహుల్‌ మొదటి నుంచి గిరిజన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ, జాతీయ స్థాయిలో గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న గిరిజన మ్యూజియం విస్తరణ, అభివృద్ధిపై తన మార్క్‌ చూపించారు. గిరిజనగూడెం వాతావరణం సెట్‌, చిన్నారుల ఆటవిడుపు, యువతకు క్రీడా వినోదాలు, పర్యాటకులకు గిరి జన వేషధారణ, వివిధ కళాఖండాల ప్రదర్శనను కల్పించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, నిధులు విడుదల చేయించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో గిరిజన పల్లెకు పర్యాటకులు, భక్తుల ఆదరణ పెరిగింది. ఇక ఇటీవల ఆదివాసీ వస్తువులు, వారి ఆహార ఉత్పత్తులు, ఇతర సామగ్రి నాణ్యతతో, తక్కువ ధరలో దొరికే విధంగా రూపొందించిన భద్రగిరి మార్ట్‌ లాభాల బాటలో నడుస్తోంది. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు ఉపాధి లభిస్తోంది. ఈ రెండింటిని సైతం రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఇలవేల్పుల చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చి భవిష్యత్‌ గిరిజన తరాలకు వారి సంప్రదాయాన్ని భద్రపరిచారు. ఇక ఆదివాసీ కోయ భాషను నేర్చుకుని వారిలో ఒకరిగా కలిసిపోయారు. కోయ భాషలో ప్రసంగాలు లు ఇస్తూ, ఆహ్వాన పత్రికలను ముద్రిస్తూ ఆ భాషపై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు.

గిరిజన విద్యార్థులకు విద్యలో ప్రాథమిక దశలోనే కనీస సామర్థ్యాలను పెంపొందించే దిశగా ప్రత్యేకంగా ఉద్దీపనం పేరిట 3, 4వ తరగతుల్లో గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ల్లో స్టడీ మెటీరియల్‌ను తొలుత రూపొందించారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంతో దీనిని విస్తృతపర్చి 1, 2వ తరగతులకు సైతం ప్రవేశపెట్టారు. ఉన్నత విద్య బలోపేతం కావడానికి ఇది ఉపయోగపడుతోంది. పదో తరగతి అనంతరం ఉన్నత విద్య, ఉద్యోగాలపై కెరీర్‌ గైడెన్స్‌ వాల్‌ను ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేసి ఉన్నతాధికారులతో సూచనలు ఇప్పించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement