జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ప్రేమలత
సూపర్‌బజార్(కొత్తగూడెం): పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ తెలిపారు. కక్షిదారులు పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందని చెప్పారు. చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాదాల పరిహారం, ఆస్తి పంపకాల వివాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, మనోవర్తి తదితర కేసులను పరిష్కరించుకునే అవకాశముందని తెలిపారు. లోక్ అదాలత్‌లో ఇరుపక్షాల అంగీకారంతోనే నిర్ణయం జరుగుతుందని, తద్వారా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా తక్షణ తీర్పు లభిస్తుందని వెల్లడించారు. ఈమేరకు కక్షిదారులు, ప్రతివాదులు తమ న్యాయవాదుల ద్వారా లేదా నేరుగా కోర్టుల్లో సంప్రదించి కేసులను లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు.


