సమస్యల పరిష్కారానికి గ్రామసభలు
● సమర్థవంతంగా ఎదుర్కోవాలి ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అంకిత్
సూపర్‌బజార్(కొత్తగూడెం): గోదావరికి ఏ స్థాయి లో వరద వచ్చినా ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణు గోపాల్‌తో కలిసి కలెక్టరేట్‌లో ఆయన శనివారం అధికారులతో సమీక్షించారు. ముంపునకు గురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రజలను తరలించేందుకు పునరావాస కేంద్రాలను గుర్తించాలని తెలిపారు. అలాగే, బోట్లు, నాటు పడవలు, లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. గోదావరి నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. అలాగే, తాగునీరు, వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు నిల్వలు సిద్ధం చేసుకోవాలన్నారు. అంతేకాక ముంపు ప్రాంతాల్లోని గర్భిణుల సమాచారాన్ని సేకరించి ఆస్పత్రులకు తరలించాలని కలెక్టర్ తెలిపారు.
వరి కొనుగోళ్లు పూర్తి చేయాలి
త్వరలోనే రుతుపవనాలు రానున్న నేపథ్యాన వరి కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదే శించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన సూచనలు చేశారు. అలాగే, 9నజరిగే మండల మహిళా సమాఖ్య సభ్యు ల బస్సుల ప్రారంభోత్సవం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ వీసీలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన, డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం త్రినాథ్‌బాబు, డీఐఈఓ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు.
చుంచుపల్లి: ప్రజల సమ్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సభల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కాగా, రైతులు పంట మార్పిడి పద్ధతి పాటిస్తూ ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. కాగా, ఎస్‌ఐఆర్‌పై అపోహలు విడనాడి సిబ్బందికి సహకరించాలని ఆయన తెలిపారు. అలాగే, బడిబాట తదితర అంశాలపై సూచనలు చేయగా, రహదారులు, విద్యుత్ లైన్లు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటుపై స్థానికులు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ మాలోత్ భారతి, ఎంపీడీఓ జి.సుస్మిత, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


