ఎంపీ రఘురాంరెడ్డి,
ఎమ్మెల్యే కూనంనేని
అధికారుల తీరుపై బీఆర్‌ఎస్
కార్పొరేటర్ల నిరసన
కొత్తగూడెంఅర్బన్: ప్రణాళికాయుతంగా వ్యవహరిస్తూ సమష్టి నిర్ణయాలతో అభివృద్ధి చేసుకోవాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) సర్వసభ్య సమావేశం మేయర్ మూడ్ గణేశ్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యలను గుర్తించడమే కాక ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తే ప్రజల ఇబ్బందులు తీరుతాయని తెలిపారు. అంతేకాక డివిజన్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం కృషి చేయాలన్నారు. పైపులైన్ల పనులు పూర్తయితే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కాగా, సిబ్బంది కొరత అధిగమించేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతామని వెల్లడించారు. అనంతరం అజెండాలలోని అంశాలపై చర్చించి ఆమోదించారు.
బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల ప్రదర్శన
బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు నల్లకండువాలు కప్పుకొని, చేతుల్లో ప్లకార్డులతో కార్యాలయానికి ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకుని సమావేశంలో అందరికీ అవకాశం ఉంటుందని చెప్పి అనుమతించారు. అయితే, సమావేశంలో హాల్‌లో కూడా వారు నిరసన తెలిపారు. కమిషనర్ సహా ఉద్యోగులెవరూ ఫోన్లకు స్పందించడం లేదని, అలాంటప్పుడు సమస్యలు ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సిబ్బంది కొరత ఉండగా, ఉన్నవారితో ప్రజాప్రతినిధులు, అధికారుల ఇళ్లలో పనిచేయిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజాసేవకు అంకితం కావాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కార్పొరేటర్లు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజాసేవకు అంకితం కావాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. కౌన్సిల్ సమావేశానికి ముందు ఆయన సీపీఐ పక్ష కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ప్రతీ డివిజన్‌లో డ్రెయినేజీలు, రహదారులు, తాగునీటి సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కరించాలని తెలిపారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, మేయర్ మూడ్ గణేశ్, నాయకులు కంచర్ల జమలయ్య పాల్గొన్నారు.


