రామయ్యకు సువర్ణతులసార్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణతులసార్చన

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసార్చన జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు జరిపించారు. వారాంతం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

వైదిక పోస్టులకు

13న రాత పరీక్ష

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న వైదిక పోస్టుల భర్తీకి ఈనెల 13న రాతపరీక్ష నిర్వహిస్తున్నట్లు ఈఓ దామోదర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌ కాచిగూడలోని తుల్జా భవన్‌ ధర్మశాలలో రాత, మౌఖిక పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారు ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు భద్రాచలంలోని తానీషా కల్యాణ మండపంలో ఒరిజనల్‌ పత్రాలు, మూడు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో హాజరైతే పరిశీలన అనంతరం అర్హులకు హాల్‌టికెట్లు జారీ చేస్తామని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఈఓ సూచించారు.

9 నుంచి కిన్నెరసానిలో సఫారీ టూర్‌!

వర్చువల్‌గా ప్రారంభించనున్న

సీఎం రేవంత్‌రెడ్డి

పాల్వంచరూరల్‌: మండలంలోని కిన్నెరసాని అభయారణ్యానికి వచ్చే పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సఫారీ వాహనాల టూర్‌ మరో మూడురోజుల్లో ప్రారంభం కానుంది. అటవీ శాఖ ఆధ్వర్యాన ఇప్పటికే వాహనాలను సిద్ధం చేయగా, వీటిని 9వ తేదీన హైదరాబాద్‌ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ బి. బాబు వెల్లడించారు. కిన్నెరసానిలో ఈ కార్యక్రమానికి ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్‌ అంకిత్‌, సీసీ ఎఫ్‌ బీమానాయక్‌, డీఎఫ్‌ఓ కృష్ణగౌడ్‌ తదితరులు హాజరవుతారని తెలిపారు.

నకిలీ విత్తనాల

బారిన పడొద్దు

టేకులపల్లి: నకిలీ విత్తనాలతో నష్టపోకుండా రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వ్యవసాయ అధికారి వి.బాబూరావు సూచించారు. మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్‌ షాపుల్లో శనివారం ఆయన తనిఖీ చేశారు. విత్తన నిల్వలు, అమ్మకాలు, రిజిస్టర్ల నిల్వలపై యాజమాన్యాలకు సూచనలు చేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. రైతులు ఆధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయడంతో పాటు పంట కాలం పూర్తయ్యే వరకు రశీదులు భద్రపర్చకోవాలని తెలిపారు. అధిక దిగుబడులు వస్తాయని గ్రామాలకు వచ్చి చెప్పే వారిని నమ్మకుండా, వారి సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇంకా ఈ తనిఖీల్లో ఏఓ నీరుడు అన్నపూర్ణ, ఏఈఓలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement