‘సాదా బైనామా’కు ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

‘సాదా బైనామా’కు ప్రాధాన్యమివ్వాలి

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

సత్వర సేవలు అందించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో భూభారతి, సాదా బైనామా, ఇతర భూసేకరణ పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రాత్రి అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌తో కలిసి అశ్వాపురం, మణుగూరు, పినపాక, అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, సాదా బైనామా కేసులు, భూసేకరణ అంశాల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని ఆదేశించారు.

మార్గదర్శకులుగా వ్యవహరించాలి

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల అమలు, ఉపాధి కల్పన కార్యక్రమాల పురోగతిపై సమీక్ష జరిపారు. టీజీఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు 50 దరఖాస్తులు అందగా, 39 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు వివరించగా, యువ పారిశ్రామికవేత్తలకు సహకారం అందించాలని కలెక్టర్‌ సూచించారు. అధికారులు డేవిడ్‌రాజ్‌, మధుసూదన్‌ రెడ్డి, రామిరెడ్డి, రాజేష్‌, పరంధామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరికలు పెంచాలి

పాలిటెక్నిక్‌ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అడ్మిషన్లపై శుక్రవారం రాత్రి కళాశాల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదని అన్నారు. అనంతరం పాలిటెక్నిక్‌ కోర్సుల వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు.

టేకులపల్లి: ప్రజలకు సత్వర సేవలందించాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. శుక్రవారం ఆయన టేకులపల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజావాణి, భూభారతి, సాదా బైనామా, జనన మరణ కుల, ఆదాయ , ఇతర ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు, పరిష్కారాలపై ఆరా తీశారు. బాధ్యతాయుతంగా పనిచేస్తూ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సిబ్బందికి సూచించారు. తహసీల్దార్‌ వీరభద్రం, ఏఓ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement
 
Advertisement
Advertisement