లారీ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

చుంచుపల్లి: కొత్తగూడెం ఇల్లెందుకు క్రాస్‌రోడ్డు లోతువాగు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం రామవరంకు చెందిన బి.నవీన్‌కుమార్‌ (38) ర్యాపిడో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు సమాచారం. దీనిపై లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌ షాక్‌తో రెండు గేదెలు..

టేకులపల్లి: మండలంలోని బేతంపూడి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి డంపింగ్‌ యార్డు పక్కనే ఉన్న పెద్దబోయిన అశోక్‌ పొలం వద్ద విద్యుత్‌ తీగ తెగిపడింది. అయితే రోజువారీ లాగే శుక్రవారం ఉదయం పొలం పనుల నిమిత్తం వెళ్లిన అదే గ్రామానికి చెందిన పేద రైతు జాలాది శ్రీనుకు చెందిన రెండు పాడి బర్రెలు ఆ విద్యుత్‌ తీగలకు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. దీంతో కుటుంబానికి ఆసరాగా నిలిచే రూ.లక్షల విలువైన పాడి పశువులను కోల్పోవడంతో ఆ పేద కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించారు. గత రెండేళ్లుగా ఆ విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోలేదని ప్రజలు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి బాధిత రైతుకు నష్టపరిహారం అందించి, ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్‌

సుజాతనగర్‌: వాహనంలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను సుజాతనగర్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి నుంచి సూజాతనగర్‌ రోడ్డులో ఎస్‌ఐ తన సిబ్బందితో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో అనుమానస్పదంగా వెళ్తున్న ట్రాలీ ఆటోను ఆపి తనిఖీ చేయగా రెండు ఆవు దూడలు, రెండు కోడె దూడలు, ఒక్క దున్నపోతు ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు వాహనాన్ని సీజ్‌ చేసి అక్రమంగా తరలిస్తున్న సూర్యాపేట జిల్లా కోదాడ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బత్తుల శ్రీను, గుడిబండ గ్రామానికి చెందిన మాదాసు శ్రీను, డ్రైవర్‌ సేవియాను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులు టేకులపల్లి ప్రాంతంలో బ్రోకర్‌ సేవియా సహకారంతో రైతుల నుంచి పశువులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి కోదాడ సంతలో ఎక్కువ ధరలకు విక్రయించేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తూ పట్టుబడినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

దమ్మపేట: మద్యానికి బానిసైన భర్త ప్రవర్తనలో మార్పు రాదని విసుగుచెందిన ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తొట్టిపంపు గ్రామ పరిధిలోని హనుమంతుగుంపునకు చెందిన వాడే తిరుపతమ్మ (32) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈక్రమాన ఆమె భర్త వెంకటేష్‌ మద్యానికి బానిసై కుటుంబ పోషణను పూర్తిగా పట్టించుకోవడం లేదు. దీంతో గురువారం రాత్రి మద్యం మానేయాలని తిరుపతమ్మ భర్తతో గొడవ పడింది. అతడి ప్రవర్తనలో మార్పు రాదనే భావనతో విసుగుచెందిన ఆమె ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు మీడియం రాజులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ రాజేష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement