చింతకాని: ఇసుక టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంతో వార్డుసభ్యుడు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని 10వ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు మాతంగి నాగరాజు(32) తన స్నేహితుడు లింగాల మహేందర్‌తో కలిసి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు బైక్‌పై గురువారం రాత్రి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా పందిళ్లపల్లి సబ్‌స్టేషన్ వద్ద బోనకల్ వైపు నుంచి ఖమ్మం ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడమే కాక ద్విచక్ర వాహనాన్ని కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో వాహనం వెనుక కూర్చొన్న నాగరాజు కాళ్ల పైనుంచి టిప్పర్ టైరు వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, వాహనం నడుపుతున్న మహేందర్ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు 108లో క్షతగాత్రుడిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, నాగరాజు సోదరుడు లుకాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. కాగా, నాగరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వార్డు నాగరాజు మృతదేహం వద్ద రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. కార్యక్రమంలో మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొప్పుల గోవిందరావు, అబ్దుల్ నబీ, మండల అధ్యక్షుడు కన్నెబోయిన గోపీ, సర్పంచ్ కిలారు మనోహర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఇసుక టిప్పర్


