పాల్వంచరూరల్: నాణ్యత లేని, లూజు విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖాధికారి వి. బాబూరావు హెచ్చరించారు. శుక్రవారం పాల్వంచలోని పలు ఎరువులు, ఫర్టిలైజర్స్, విత్తనాల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, ఇన్‌వాయిస్ బిల్ బుక్స్, స్టోర్ సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం డీలర్లతో మాట్లాడుతూ.. ప్రతీ డీలర్ స్టాక్ వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలని, రైతులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. రైతులు తొందరపడి పొడి దుక్కుల్లో విత్తనాలను నాటొద్దని, లూజు, లేబుల్ లేని విత్తనాలను కొనుగోలు చేయొద్దని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు గాని, వ్యవసాయాధికారులకు గాని ఫిర్యాదు చేయాలని చెప్పారు. తనిఖీల్లో మండల వ్యవసాయశాఖ అధికారి బి.శంకర్ పాల్గొన్నారు.


