లక్ష్యం చేరని ‘తునికాకు’ | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం చేరని ‘తునికాకు’

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

● జిల్లాలో 47 శాతం మాత్రమే సేకరణ ● ఆసక్తి చూపని గిరిజన, గిరిజనేతర కూలీలు ● సేకరణ ప్రారంభంలో జాప్యం కూడా కారణమే

డివిజన్ల వారీగా తునికాకు సేకరణ (స్టాండర్డ్‌ బ్యాగులు)

గతేడాదికంటే పెరిగింది

● జిల్లాలో 47 శాతం మాత్రమే సేకరణ ● ఆసక్తి చూపని గిరిజన, గిరిజనేతర కూలీలు ● సేకరణ ప్రారంభంలో జాప్యం కూడా కారణమే

పాల్వంచరూరల్‌: ఈ సీజన్‌లో కూడా తునికాకు సేకరణ లక్ష్యం చేరలేదు. అయితే గతేడాది కంటే పెరి గింది. గత సంవత్సరం లక్ష్యంలో 29.52 శాతం తునికాకు సేకరించగా, ఈ సారి 47 శాతం సేకరించారు. అంటే 12 శాతం పెరిగింది. గతనెలలో సేకరణ మొదలు కాగా, గిరిజనులు, గిరిజనేతరులు తునికాకు సేకరించారు. ఎక్కువ మంది ఉపాధి పనులకు వెళ్లడం, ఎండ తీవ్రత వల్ల ఆకు సేకరణ తగ్గినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఆరుడివిజన్ల పరిధిలో ఈ ఏడాది తునికాకు సేకరణ లక్ష్యం 32,690 స్టాండర్డ్‌ బ్యాగులు కాగా, 14,419 స్టాండర్డ్‌ బ్యాగులు మాత్రమే సేకరించారు. గతేడాది 35,300 స్టాండర్డ్‌ బ్యాగులు లక్ష్యం కాగా, 10,361 బ్యాగులు సేకరించారు. కాగా, గత నెల 31వ తేదీతో సేకరణ ముగిసింది.

కారణాలివే..

పలు అవరోధాలు ఎదురుకావడంతో తునికాకు సేకరణ తగ్గింది. అకాల వర్షాలు, అధికారులు సేకరణను ప్రారంభించడంలో జాప్యం చేయడంతో కూలీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వర్షాల కారణంగా చీడ పీడలు పట్టి ఆకు పనికిరాకుండాపోయింది. దీంతో అనుకున్న, నాణ్యమైన ఆకు సేకరణ జరగలేదు. ఏటా మేలో నెలరోజులపాటు తనికాకు సేకరిస్తారు. ఈసారి 15 రోజులు మాత్రమే సేకరించారు. గతంలో 50 ఆకుల కట్టకు రూ.3 చొప్పున చెల్లిస్తే ఈసారి రూ.3.30 చొప్పున కూలీలకు చెల్లించారు. ఏటా గిరిజనులు వేసవి పంటగా భావించే తునికాకు సేకరణ రెండేళ్లుగా తగ్గిపోతుండటంతో ఆ మేరకు ఆదాయం కూడా కోల్పోతున్నారు.

డివిజన్‌ టార్గెట్‌ సేకరణ శాతం

కిన్నెరసాని అభయారణ్యం 3,200 831 26

భద్రాచలం 9700 7,145 80

ఇల్లెందు 10,600 2,458 26

మణుగూరు 5,400 3,052 60

పాల్వంచ 2,300 653 28

కొత్తగూడెం 1,490 280 18

మొత్తం 32,690 14,419 47

ఈసారి అకాల వర్షాలకు తోడు కూలీలు కూడా సేకరణపై అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో లక్ష్యం పూర్తి కాలేదు. గతంలో తునికాకు సేకరణకు ఏజెన్సీ గ్రామాల్లో కూలీలు అధిక సంఖ్యలో వచ్చేవారు. ఇప్పడా పరిస్థితి లేదు. నాణ్యమైన తునికాకు జిల్లాలోనే అధికంగా లభిస్తుంది. గతేడాదికంటే ఈసారి సేకరణ పెరిగింది.

–జి. కృష్ణాగౌడ్‌, డీఎఫ్‌ఓ

Advertisement
 
Advertisement
Advertisement