విద్య.. వాసంతి.. సవాళ్లు | - | Sakshi
Sakshi News home page

విద్య.. వాసంతి.. సవాళ్లు

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

● ఇన్‌చార్జి పాలనలోనే సాగిన గత విద్యాసంవత్సరం ● పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో లాస్ట్‌ నుంచి రెండో ర్యాంక్‌ ● పర్యవేక్షణ కొరవడి తెలుగు సబ్జెక్ట్‌పై పట్టుకోల్పోతున్న విద్యార్థులు ● ప్రైవేటు పాఠశాలల ఫీజు దందాపై చర్యలు చేపట్టని అధికారులు

● ఇన్‌చార్జి పాలనలోనే సాగిన గత విద్యాసంవత్సరం ● పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో లాస్ట్‌ నుంచి రెండో ర్యాంక్‌ ● పర్యవేక్షణ కొరవడి తెలుగు సబ్జెక్ట్‌పై పట్టుకోల్పోతున్న విద్యార్థులు ● ప్రైవేటు పాఠశాలల ఫీజు దందాపై చర్యలు చేపట్టని అధికారులు

కొత్తగూడెంఅర్బన్‌: ఇటీవల బాధ్యతలు చేపట్టిన కొత్త జిల్లా విద్యాశాఖాధికారికి సరికొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. గతేడాది ఇన్‌చార్జ్‌ డీఈఓ పాలనతో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించింది. ఫలితంగా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా చివరి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఎక్కువ మంది విద్యార్థులు తెలుగు సబ్జెక్ట్‌లోనే ఫెయిల్‌కావడం చర్చకు దారితీసింది. ప్రభుత్వ సౌకర్యాలను అందిపుచ్చుకుని మెరుగైన ఫలితాలు రాబట్టడంలో జిల్లా విద్యాధికారులు వెనుకబడ్డారు. ఈ క్రమంలో జిల్లాకు పూర్తిస్థాయి డీఈ ఓను నియమించడం హర్షణీయం. డీఈఓగా బాధ్యతలు చేపట్టిన వాసంతి గతంలో కూడా ఇక్కడ డీఈఓగా పనిచేశారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖలో జిల్లా కో ఆర్డినేటర్ల పదవీ కాలం ముగిసినా డిప్యూటేషన్‌పై అదే పోస్టులో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన కో ఆర్డినేటర్ల నియామకం చేపట్టాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలల తిరిగి ప్రారంభంకానున్నాయి. జిల్లాలో అనుమతి రెన్యూవల్‌ చేసుకోని పాఠశాలలు, అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఎంఈఓలు ఈ పనులన్నీ నిర్వహించేందుకు గోప్యత పాటిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొత్త డీఈఓ వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ప్రైవేటు పాఠశాలలపై కొరవడిన నిఘా

గతేడాది ప్రైవేటు పాఠశాలలపై కూడా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాల్సి ఉన్నా.. ఏ ఒక్క పాఠశాలలోనూ ఫీజు పట్టిక ఏర్పాటు చేయలేదు. ఈ ఏడాది అయిన ఫీజుల పట్టికలు ఏర్పాటు చేసేలా డీఈఓ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫీజు లు, ప్రవర్తన రకరకాల కారణాలు చెబుతూ ఒక బ్రాంచ్‌ నుంచి మరో బ్రాంచ్‌కు మార్చుతుండటంతో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం పాఠశాలల్లోనే కొనాలని యాజమాన్యాలు తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. అధిక ఫీజులు, పుస్తకాల పేరుతో రూ. వేలకు వేలు వసూళ్లు చేస్తున్నా యి. ఈ వ్యవహారం ఏటా జరుగుతున్నా అధికారులు చర్యలు చేపట్టడంలేదు. ఈ ఏడాదైనా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు కొంత ఆర్థిక వెసులుబాటు లభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త డీఈఓ సమస్యలపై దృష్టి సారించి విద్యార్థులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement