● ప్రకృతిని ప్రేమిద్దాం.. వనరులను సంరక్షిద్దాం.. ● మానవ తప్పిదాలతో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు ● అవగాహన పెంచుకుంటే మేలు
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
పాల్వంచరూరల్: మావన తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా పర్యావరణంపై ప్రభావం పడుతోంది. పర్యావరణ వ్యతిరేక కార్యకలాపాలతో అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుండడంతో మానవ మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారుతోంది. పర్యావరణ పరీరక్షణ కోసం ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ ప్రాధాన్యాన్ని గుర్తించి దాని పరిరక్షణ కోసం కార్యాచరణ రూపొందించి జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం చేకూరితే కొంతమేరకై నా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ప్రతీది ప్రకృతి నుంచి లభిస్తున్నా.. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యంతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనికి పెరిగే జనాభా తోడై సమస్య ఇంకా తీవ్రమతుంది. ఆధునికత పెరిగిన కొద్దీ వనరుల వినియోగం, వస్తు వినియోగం పెరుగుకుంటూ వస్తుండగా.. వివిధ ప్రాంతాల్లో ఉంటే వారు తమ అవసరాల మేరకు చెట్లను ఇష్టాను సారంగా నరికివేయడంతో ప్రభావం పర్యావరణంపై పడి అవాంతరాలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న కాలుష్యం..
రోజురోజుకు వాయు కాలుష్యం పెరగడంతో పర్యావరణపై ప్రభావం పడుతోంది. దీనికి తోడు వాహనాల కాలుష్యంతో ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుంది. అడవులు అంతరించిపోవడం కూడా వాతావరణ కాలుష్యానికి కారణమని చెప్పొచ్చు. ప్రజల ఆర్థిక, సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి ఇష్టానుసారంగా చెట్లను నరికివేయడంతో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఓజోన్ పొర దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ ఏర్పడి విపత్తులు సంభవిస్తున్నట్లు గ్లోబల్ మానిటైజేషన్ ఫోరం గతంలో ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా భౌగోళిక ఉష్ణోగ్రతలు పెరగడం, తుపానులు రావడం, అతివృష్టి, అనావృష్టి వంటి దుష్పరిణామాలు సంభిస్తున్నట్లు చెప్పారు. అయితే గత ప్రభుత్వ హయాంతో ప్రవేశపెట్టిన ‘హరితహారం’పథకంలో రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో మొక్కలు నాటారు. ఈక్రమాన ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ జీవవైవిద్య సదస్సులో ప్రపంచదేశాల ప్రతినిధులు వాతావరణ కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.


