నిందితులు భద్రాద్రి జిల్లా వాసులు
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మీదుగా తరలిస్తున్న రూ.6.25 లక్షల విలువైన 526 గ్రాముల హాష్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేశామని సీఐ అనుమలు శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం వారు వివరాలు వెల్లడించారు. ఎస్సై మహేశ్, సిబ్బందితో కలిసి మండల కేంద్రం సమీపంలోని జీడివాగు వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఈక్రమాన బైక్‌పై వచ్చిన భద్రాద్రి జిల్లాకు చెందిన నల్లగట్ల సురేంద్రకుమార్, బండ్ల సాయి అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా హాష్ ఆయిల్ లభించింది. వీరిద్దరు ఒడిశాలోని కుమురమానూరు చెందిన రాజునాయక్ వద్ద హాష్ ఆయిల్ కొనుగోలు చేసి బైక్‌పై ఏటూరునాగారం మీదుగా ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సిరోంచ వైపునకు వెళ్తూ పట్టుబడ్డారని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై మహేష్, సిబ్బంది హరీశ్, చంద్రమోహన్, సదానందం, సుధాకర్, మహేందర్ పాల్గొన్నారు.
అన్నదమ్ములను బలితీసుకున్న ట్రాక్టర్..
బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి
చర్ల: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడిన సంఘటన ఇది. ఇటీవల వారు ఓ ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి పని నిమిత్తం భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్తుండగా మృత్యురూపంలో ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందగా.. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కొడుకులు మృతి చెందారని వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ విచారక ఘటన దుమ్ముగూడెం మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా.. చర్ల మండలం గొమ్ముగూడెంకు చెందిన చుంచు సంతోష్‌కుమార్ (22), చుంచు సాయి చరణ్ (16)లు గురువారం భద్రాచలం నుంచి చర్ల వైపునకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈక్రమంలో చర్ల నుంచి భద్రాచలం వైపునకు వెళ్తున్న ట్రాక్టర్ డీకొట్టడంతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇటీవల ఎస్సెస్సీ పూర్తి..
స్వయాన అన్నదమ్ములైన వారిద్దరు ఇటీవలే కొత్త బైక్ కొనుగోలు చేశారు. ఇందులో సాయి చరణ్ మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులవగా ఇంటర్‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే జరిగిన రోడ్డు ప్రమాదంలో వారిద్దరూ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను శవ పంచనామా కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు బోరున విలపించగా.. స్వగ్రామమైన గొంపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి.
చెట్టును ఢీకొట్టిన కారు..
పినపాక: మండల పరిధిలోని ఏడూళ్లబయ్యారం–రంగాపురం ప్రధాన రహదారి గోపాలరావుపేట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరు కరకగూడెం మండలానికి చెందిన విద్యుత్ శాఖ లైన్‌మెన్ దంపతులుగా తెలిసింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో చెట్టు పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తలగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం పినపాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


