సవరించిన భూముల మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో పాత ధరలతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయవిక్రయదారులు బారులు దీరారు. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 66 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరగగా, రూ.38,81,923 ఆదాయం సమకూరింది. మిగతా కార్యాలయాల్లో కూడా రద్దీ నెలకొంది. కాగా, ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు కూడా పెరిగిన ధరకు అనుగుణంగా శుక్రవారం నుంచి అదనపు రుసుము చలాన్ చెల్లించాలని స్పష్టం చేశారు. పెరిగిన ధరలతో రిజిస్ట్రేషన్లు చేయనుండగా, ఆ మేరకు రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది.


