కేవలం కిన్నెరసానినే..
కేవలం కిన్నెరసాని ముంపునే గుర్తిస్తున్న పోలవరం అథారిటీ పోలవరం పరిగణనలోకి రాని ఇతర వాగులు, శబరికి వరద పోటు శాసీ్త్రయంగా నష్టాలను గుర్తించి, పరిహారం అందించాలని డిమాండ్
నది/వాగు ముంపు గ్రామం
(ఎకరాలు)
కిన్నెరసాని 312 బూర్గంపాడు
దోమలవాగు 194 బూర్గంపాడు
పెద్దవాగు 239 నాగినేనిప్రోలు
ఏదులవాగు 60 మోతే
ఇరవెండి వాగు 7 ఇరవెండి
తూరుబాక వాగు 75 తూరుబాక
మేడివాయి వాగు 12 ఎటపాక
మొత్తం 899
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోలవరం ప్రాజెక్ట్‌కు సాంకేతిక చిక్కులతోపాటు నష్టపరిహారం చెల్లింపులు కూడా సమస్యగా మారింది. పరిహార భారాన్ని తగ్గించేందుకు ముంపు నష్టాన్ని తక్కువగా చేసి చూపుతున్నారనే వాదనలు ఆది నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా వాస్తవ నష్టాన్ని లెక్కించేందుకు పీపీఏ క్షేత్రస్థాయి పర్యటనకు రావడంతో అసలైన ముంపు లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి.
ముంపే అసలు సమస్య
గోదావరి నుంచి ఏటా మూడు వేల టీఎంసీలకు పైగా నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని ఒడిసి పట్టేందుకు గోదావరిపై ఇచ్చంపల్లి, పోలవరం దగ్గర భారీ జలాశయాలు కట్టాలనే ఆలోచనలు నైజాం/ బ్రిటీష్ జమానా నుంచి ఉన్నాయి. అయితే, ప్రతిపాదిత డ్యామ్ నిర్మిత స్థలం దట్టమైన అడవుల మధ్య ఉండటం, పైగా భారీ ఎత్తున నీటిని నిల్వ చేస్తే లక్షలాది ఎకరాల భూములు ముంపునకు గురి కావడం పెద్ద సమస్యగా నిలిచింది. పోలవరం కూడా మొదట్లో 800 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం అనుకున్నది కాస్తా భారీ స్థాయిలో ముంపు ఉండటం, ఆ మేరకు అత్యంత భారీ స్థాయిలో పరిహారం చెల్లించాల్సి రావడం సమస్యగా మారింది. దీంతో ప్రస్తుతం 194 టీఎంసీలకే ప్రాజెక్ట్‌ను పరిమితం చేశారు. అయినప్పటికీ తెలంగాణలో ఏడు మండలాలు పోలవరం ముంపు పరిధిలో ఉండటంతో వాటిని ఆగమేఘాల మీద రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపారు. ఇంత చేసినా పోలవరం బ్యాక్ వాటర్‌తో ఏపీలోనే లక్షకు పైగా కుటుంబాలు నిర్వాసితులుగా తేలాయి. భద్రాచలం ఏజెన్సీ భారీగానే నష్టపోతోంది. వాస్తవాలు ఇలా ఉంటే, తెలంగాణ పరిధిలో ముంపు ప్రభావం నామమాత్రమే అనేది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాదనగా ఉంటూ వస్తోంది.
వాస్తవాలు వేరే
ప్రతీ ఏటా గోదావరికి వచ్చే భారీ వరదలను పరిశీలిస్తే పోలవరం బ్యాక్ వాటర్ కిన్నెరసాని నదిలో 18 కి.మీ వరకు కనిపిస్తోంది. ముర్రేడు సైతం ముంపు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారమే కిన్నెరసానితో పాటు దానిలో కలిసే దోమలవాగుకు సైతం బ్యాక్ వాటర్ వస్తోంది. దీని వల్ల 194 ఎకరాలు పరిహారం కోసం అర్హులుగా తెలంగాణ గుర్తించింది. కిన్నెరసాని నుంచి ఎగువకు రెండు వైపులా పరిశీలిస్తే పెద్దవాగు, ఏదులవాగు, ఇరవెండి వాగు, తూరుబాక, మేడివాయి వాగుల పరిధిలో సైతం ముంపు ప్రభావం ఉంది. మొత్తంగా అన్ని వాగులను పరిగణనలోకి తీసుకుంటే కనిష్టంగా 899 ఎకరాలు ముంపుగా తేలుస్తోంది. ఈ మేరకు పీపీఏ నుంచి పరిహారం రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా పులితేరు వాగు, చిన్నవాగుల నష్టాలను కూడా గణించాలని స్థానికులు కోరుతున్నారు.
పరిగణనలోకి శబరి ?
ప్రస్తుతం పీపీఏ లెక్కలన్నీ పోలవరం డ్యామ్ దగ్గర 45.72 మీటర్ల గరిష్ట స్థాయిలో నిల్వ ఉంచితే భద్రాచలం దగ్గర 43 మీటర్ల ఎత్తులో నీరు ఉంటుంది. కనిష్ట స్థాయిలో 41.14 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంటే 28 మీటర్ల ఎత్తుగా పేర్కొంటూ నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంచనాల్లోనే అనేక లోపాలు ఉన్నాయి. వీటిని సవరించాలనేది ప్రభావిత ప్రాంతాల ప్రజలు, తెలంగాణ డిమాండ్‌గా ఉంది. దీని చుట్టే సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ భద్రాచలం–పోలవరం మధ్యన కూనవరం దగ్గర శబరి గోదావరిలో కలుస్తుంది. డ్యామ్‌తో సంబంధం లేకుండానే శబరికి వరద పోటెత్తితే భద్రాచలం దగ్గర వరద నీరు కిందికి పోకుండా పరీవాహక ప్రాంతాలను ముంచుతుంది. అలాంటి డ్యామ్ పూర్తయిన తర్వాత తుపాన్లు, క్లౌడ్‌బరస్ట్ వంటి విపరీత పరిస్థితులు ఒకేసారి వచ్చినా, శబరికి భారీ వరద వచ్చినా, ప్రస్తుతం పేర్కొంటున్న లెక్కలు, అంచనాలు తలకిందులవుతాయి. భద్రాచలం ఏజెన్సీలో బ్యాక్ వాటర్ ప్రభావాన్ని అంచనా వేసేప్పుడు శబరి పోటును కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా గోదావరికి ఎడమ వైపు కేవలం భద్రాచలం పట్టణాన్ని మినహాయించి మిగిలిన మండలం మొత్తాన్ని పోలవరం కోటాలో ఏపీలో కలిపారు. కుడి వైపున బూర్గంపాడు మండలంలో కిన్నెరసాని నది వరకు ఉన్న గ్రామాలను తెలంగాణలో ఉంచి, మిగిలిన వాటిని ఏపీలో పంపారు. ప్రస్తుతం కిన్నెరసాని నది ఏపీ, తెలంగాణల మధ్య సరిహద్దుగా ఉంది. దీంతో సరిహద్దులో ఉన్న కిన్నెరసాని పరీవాహక ప్రాంతం ఒక్కటే పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఇబ్బందులకు గురవుతోందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) వాదిస్తోంది. అందువల్లే పీపీఏ లెక్కల ప్రకారం పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం కేవలం కిన్నెరసానికి ఎడమ వైపు బూర్గంపాడు మండలంలో 312 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్టు పేర్కొంటోంది.
పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వేయి ఎకరాలకు ముప్పు


