భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అదేవిధంగా స్వామి వారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు.
రామయ్య సేవలో మాజీ ఐఏఎస్‌లు..
భద్రాచలంఅర్బన్: శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఉద్యోగ విరమణ పొందిన ఐఏఎస్ అధికారులు సత్యనారాయణ రెడ్డి, వెంకటరామిరెడ్డి గురువారం దర్శించుకున్నారు. కాగా వెంకటరామిరెడ్డి ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. పట్టణంలోని అహోబిల నర్సింహాస్వామిని, దుమ్ముగూడెం ముత్యాలమ్మతల్లిని కూడా వీరు దర్శించుకున్నారు. వీరి వెంట ఉప్పాడ ప్రసాద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనక దుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ రజనీకుమారి, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
నేడు పర్యావరణ ర్యాలీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉదయం 8:45 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కోర్టు నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు పర్యావరణ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, అటవీశాఖ ఉద్యోగులు పాల్గొనాలని కోరారు.
నేడు సింగరేణి సీఎండీ రాక
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో శుక్రవారం జరుగనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్‌జ్యోతి హాజరుకానున్నారు. ఉదయం 7 గంటలకు ఇల్లెందు గెస్ట్ హౌస్‌లో మొక్కలు నాటి అనంతరం సింగరేణి హెడ్డాఫీస్ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు ప్లాంటేషన్‌కు శ్రీకారం
రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే కోల్ మైన్ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైడెన్సీటీ మిక్స్‌డ్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీఎం ఎం.శాలేంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ ఏడీ శంభూప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఈనెల 12వ తేదీ వరకు జరుగుతాయని, 1,399 మంది విద్యార్థులు హాజరుకానుండగా, నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిర్వహణకు నలుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, నలుగురు డిపార్ట్‌మెంట్ అధికారులు, 47 మంది ఇన్విజిలేటర్లు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు వివరించారు. అదనపు సమాచారం కోసం 89192 79238 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


