‘పోలవరం’తో భద్రాచలంలో మురుగు! | - | Sakshi
Sakshi News home page

‘పోలవరం’తో భద్రాచలంలో మురుగు!

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

ప్రాజెక్ట్‌లో డెడ్‌ స్టోరేజీస్థాయి నీటి నిల్వ ఉన్నా కరకట్ట స్లూయిస్‌ గేట్లు మూసివేయాల్సిన పరిస్థితి ఫలితంగా మురుగు నీటి ప్రవాహానికి బ్రేక్‌ పడి భద్రాచలంలో వరద పెరిగే అవకాశం పైనుంచి వరద పెరిగి దిగువన శబరి పోటేసిందంటే పట్టణానికి తీవ్ర ముప్పు ఇరిగేషన్‌ విభాగం అంచనా ప్రకారం ఏడాదిలో 9 నెలలపాటు ముంపు గుప్పిట్లోనే భద్రగిరి జిల్లాలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ బృందం దృష్టి సారించాలని స్థానికుల వేడుకోలు

కరకట్ట వెంబడి స్లూయిస్‌ గేట్ల ఎత్తు వివరాలు

ఆ లెక్కలు సరికాదు

ప్రాజెక్ట్‌లో డెడ్‌ స్టోరేజీస్థాయి నీటి నిల్వ ఉన్నా కరకట్ట స్లూయిస్‌ గేట్లు మూసివేయాల్సిన పరిస్థితి ఫలితంగా మురుగు నీటి ప్రవాహానికి బ్రేక్‌ పడి భద్రాచలంలో వరద పెరిగే అవకాశం పైనుంచి వరద పెరిగి దిగువన శబరి పోటేసిందంటే పట్టణానికి తీవ్ర ముప్పు ఇరిగేషన్‌ విభాగం అంచనా ప్రకారం ఏడాదిలో 9 నెలలపాటు ముంపు గుప్పిట్లోనే భద్రగిరి జిల్లాలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ బృందం దృష్టి సారించాలని స్థానికుల వేడుకోలు

2022, జూలైలో వచ్చిన గోదావరి వరదలతో నీట మునిగిన భద్రాచల పట్టణం

ఇప్పటికే ఇబ్బందుల్లో..

భద్రాచలం పట్టణానికి గోదావరి వరద నుంచి రక్షణ కల్పించేందుకు 2002/2003లో 80 మీటర్ల ఎత్తుతో కరకట్ట నిర్మించారు. పరిసరాల్లో పడిన వర్షపు నీరు, పట్టణంలో వెలువడే మురుగు నీరు గోదావరిలో కలిసేందుకు కరకట్టకు ఎనిమిది చోట్ల స్లూయిస్‌ గేట్లను ఏర్పాటు చేశారు. గోదావరి వంతెనకు ఎటపాక వైపు 4.82 కి.మీలు కరకట్ట ఉండగా, ఐదు స్లూయిస్‌ గేట్లు ఉన్నాయి. ఆలయం వైపు రూ.2.95 కి.మీ కరకట్ట ఉండగా, మూడు స్లూయిస్‌ గేట్లు ఉన్నాయి. గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక 43 మీటర్ల వద్ద ఉండగా, మూడో ప్రమాద హెచ్చరిక 53 మీటర్ల దగ్గర ఉంది. కరకట్టకు ఉన్న ఎనిమిది స్లూయిస్‌ గేట్లలో రెండు గేట్ల ఎత్తు 43 మీటర్లు, అంతకంటే దిగువన ఉన్నాయి. కీలకమైన విస్తా కాంప్లెక్స్‌ గేటు ఎత్తు 44.50 మీటర్లుగా ఉంది. గోదావరిలో వరద మొదటి ప్రమాద హెచ్చరికస్థాయి(43 మీటర్ల) వరకు రాకముందే.. 38 మీటర్ల వరకు చేరుకోగానే ముందు జాగ్రత్తగా ఈ మూడు చోట్ల డ్రెయినేజీ స్లూయిస్‌ గేట్లను మూసివేస్తున్నారు. ఇక్కడ ఆగిపోయే వరదను మోటార్ల ద్వారా గోదావరిలోకి ఎత్తి పోస్తున్నారు. ఏడాదిలో కనీసం ముప్‌పై రోజుల పాటు ఇలా శ్రమించాల్సి వస్తోంది. రేయింబవళ్లు కష్టపడిన కీలకమైన విస్తా గేటు వరద కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు, పోకల దమ్మక్క అన్నదాన సత్రం ప్రతీ సీజన్‌లో ముంపునకు గురవుతున్నాయి.

బాధ్యత పీపీఏదే

ఏడాదిలో కనీసం వంద రోజుల పాటు ఇలా ఎనిమిది గేట్లను మూసివేసి, ఎత్తిపోతల ద్వారానే ఎటపాక నుంచి భద్రాచలం వరద, డ్రెయినేజీ నీరును గోదావరిలోకి పంప్‌ చేయాల్సి ఉంటుంది. ఇక పోలవరం డెడ్‌ స్టోరేజీ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా 42.67 మీటర్ల ఎత్తులో నీరు నిలిచినప్పటికీ భద్రాచలం దగ్గర మూడు స్లూయిస్‌ గేట్ల దగ్గర ఇబ్బంది తప్పదు. కేవలం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లోనే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 28 మీటర్లుగా ఉంటుంది. అంటే, తెలంగాణ ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం అంచనాల ప్రకారం ఏడాదిలో 9 నెలల పాటు భద్రాచలం పట్టణం పోలవరం ముంపు గుప్పిట్లో ఉంటుంది. ఈ ముప్పును తొలగించేందుకు ఎటపాక, భద్రాచలం పట్టణానికి కచ్చితంగా మెరుగైన డ్రెయినేజీని నిర్మించాల్సిన బాధ్యత పోలవరం ప్రాజెక్టు అథారిటీదే అవుతుంది. ఈ మేరకు పీపీఏను ఒప్పించేలా స్థానిక ప్రజాప్రతినిధులు, తెలంగాణ సర్కార్‌ ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.

స్లూయిస్‌ గేట్లు ఎత్తు డేంజర్‌ జోన్‌

ఎటపాక–1 50.90 లేదు

ఎటపాక–2 50.90 లేదు

ఎటపాక–3 40.25 ఉంది

కొత్తకాలనీ 43.50 ఉంది

రెడ్డి సత్రం 47.85 పర్వాలేదు

విస్తాకాంప్లెక్స్‌ 44.50 ఉంది

సుభాష్‌నగర్‌ 50.90 లేదు

డంపింగ్‌ యార్డ్‌ 50.90 లేదు

గోదావరి బ్యాక్‌ వాటర్‌ ముంపు ప్రభావాన్ని అంచనా వేసేందుకు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) జిల్లాలో పర్యటిస్తోంది. ప్రస్తుతానికి పీపీఏ దృష్టి అంతా బ్యాక్‌ వాటర్‌ కారణంగా కిన్నెరసాని పరీవాహకంలో కేవలం 320 ఎకరాలే ముంపునకు గురవుతుందని నిరూపించడంపైనే ఉంది. తెలంగాణ సర్కారేమో సుమారు వెయ్యి ఎకరాలకు నష్టమని చెబుతోంది. ఈ రెండు వాదనల మధ్య భద్రాచలం మురుగు సమస్య మరుగున పడిపోతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ : 45.72 మీటర్లు

డెడ్‌ స్టోరేజీ లెవల్‌ : 43.67 మీటర్లు

భద్రాచలం డ్రెయినేజీ కనిష్ట ఎత్తు : 40.25 మీటర్లు

విస్తా కాంప్లెక్స్‌ స్లూయిస్‌ గేట్‌ : 44.50 మీటర్లు

పోలవరం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ 42.67 మీటర్లు, గరిష్ట నిల్వ సామర్థ్యం 45.72 మీటర్లుగా ఉంది. భద్రాచలం ఆలయం సగటు ఎత్తు 61 మీటర్లు, పట్టణం 55 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎంత సేపటికీ ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 45.72 వద్ద నిలపడం వల్ల 55 మీటర్ల ఎత్తులో ఉన్న భద్రాచలానికి ఎలాంటి ప్రమాదం ఉండదని వాదిస్తోంది. కానీ, భద్రాచలం డ్రెయినేజీ గోదావరిలో కలిసే ప్రాంతం 43 మీటర్ల ఎత్తు దగ్గర ఉంది. ఫలితంగా డ్యామ్‌లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తే..అంటే 45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు భద్రాచలం దగ్గర కనీసం నాలుగు స్లూయిస్‌ గేట్లను మూసి వేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా పై నుంచి వరద ప్రవాహం పెరిగి, దిగువన శబరికి పోటు వచ్చిందంటే ఎనిమిది గేట్లను మూసివేయకతప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇది భద్రాచలం పట్టణాన్ని తీవ్ర వరద ముప్పులోకి నెడుతుంది. ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపి వేయాల్సి పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement