రామయ్యకు స్నపన తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు స్నపన తిరుమంజనం

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా, శ్రీసీతారామచంద్ర స్వామివారిని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణంలో పాల్గొని కల్యాణం తిలకించగా అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు.

బటర్‌ఫ్లై పార్కును

అభివృద్ధి చేయాలి

సీసీఎఫ్‌ భీమానాయక్‌

పాల్వంచరూరల్‌: కిన్నెరసానిలో బటర్‌ఫ్లై పార్కు అభివృద్ధి చేయాలని, నక్షత్ర రాశుల వనాలకు సంబంధించి మొక్కలను పెంచాలని అటవీశాఖ సీసీఎఫ్‌ భీమానాయక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కిన్నెరసాని డీర్‌ పార్కును బుధవారం ఆయన డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్‌తో కలిసి సందర్శించారు. డీర్‌ పార్కు ఎదుట ఔషధ మొక్కల పెంపకం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అడవులను సంరక్షించాలని కోరుతూ అటవీశాఖ అధికారులు బుధవారం పట్టణంలో ద్విచక్రవాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ బి.బాబు , సిబ్బంది పాల్గొన్నారు.

మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం

సీపీఎం రాష్ట్ర నాయకుడు

బండారు రవికుమార్‌

అశ్వారావుపేటరూరల్‌: కేంద్రం, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిచ్చేందుకు చేస్తున్న మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌, పోతినేని సుదర్శన్‌ పిలుపునిచ్చారు. అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణా తరగతులను బుధవారం ప్రారంభించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ‘మతోన్మాద, కార్పొరేట్‌ రాజకీయాలు’ అనే అంశంపై వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మత విభజన రాజకీయాలు పెరిగాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి మతాన్ని సెంటిమెంట్‌గా ఉపయోగించి విద్వేష రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధాల ప్రభావంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నవరపు కనకయ్య, కొక్కెరపాటి పుల్లయ్య, ఏజే రమేష్‌, నర్సారెడ్డి, బ్రహ్మచారి, కారం పుల్లయ్య, చిరంజీవి, పిట్టల అర్జున్‌, మోరంపూడి శ్రీనివాస్‌, ఎం.రాంబాబు, కే.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement