రెండు విడతల్లోనే పూర్తి..
● సరికొత్త విధానంలో పత్తి సాగుకు రైతుల మొగ్గు ● మొక్కల సంఖ్య పెరగడంతో అదేస్థాయిలో దిగుబడి ● పంట కాలం ఆరు నెలలే కావడంతో రెండో పంటకూ అవకాశం
బూర్గంపాడు: అధిక సాంద్రత విధానంలో సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పైరు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రైతులు కూడా ఇదే విధానంలో పంటలు సాగుచేసి ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. జిల్లాలో రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 2.10లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతుంది. ఒక ఎకరానికి గతంలో ఒకటిన్నర ప్యాకెట్ల పత్తిగింజలు వేసేవారు. ప్రస్తుతం ఎకరాకు రెండున్నర ప్యాకెట్ల గింజలు వేస్తున్నారు. దీంతో పత్తి మొక్కల సంఖ్య వేలల్లో పెరుగుతున్నాయి. గతంలో ఎకరాకు సుమారు 15 వేల మొక్కలుండేవి. అధిక సాంద్రత విధానంతో మొక్కల సంఖ్య 25 వేలకు పెరిగింది. మొక్కల సంఖ్య పెరగటంతో దిగుబడులు కూడా పెరుగుతున్నాయి. మొక్కకు 15 నుంచి 25 కాయలు కాసినా ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి. తక్కువ వర్షాలు కురిసినప్పుడు మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల దిగుబడులు పెరిగే అవకాశాలున్నాయి. అధిక వర్షాలు కురిసినప్పుడు మొక్కలు ఏపుగా పెరగకుండా యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆ తర్వాత దిగుబడులు పెరగనున్నాయి.
త్వరితగతిన పంటకాలం పూర్తి
అధిక సాంద్రత విధానంలో ఎరువుల వినియోగం బాగా తగ్గుతుంది. మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల చేను నిండా పంట కనిపిస్తుంది. పురుగు మందుల వినియోగం కూడా తగ్గుతుంది. పంట తొందరగా కాపునకు వస్తుంది. త్వరితగతిన పంటకాలం పూర్తవుతుంది. దీంతో సాగునీటి వనరులు ఉన్న దగ్గర రైతులు మరో పంట సాగు చేసుకునే వీలుంటుంది. జిల్లాలో వానాకాలం పత్తి పంట వేసిన రైతులు ఆరు నెలల్లో డిసెంబర్ వరకు పంట తీసుకుని ఆ తర్వాత మొక్కజొన్న, కూరగాయలు, అపరాల పంటలు సాగు చేస్తున్నారు. గతంలో మాదిరి పత్తి సాగు చేస్తే మొక్కలు బాగా ఏపుగా పెరిగేందుకు ఎరువులు ఎక్కువగా వేయాల్సి వచ్చేది. మొక్కలు బాగా పెరిగేందుకు, కాపు వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టేది. పత్తి పంటకాలం తొమ్మిది నుంచి పదినెలలు పట్టేది. దీంతో రైతులు రెండో పంట వేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి.
రసాయనిక ఎరువుల వినియోగం పెరగటంతో భూసారం రోజురోజుకూ తగ్గిపోతోంది. పంట చేలల్లో పైరు ఎదుగుదలకు విపరీతంగా ఎరువులు వేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక సాంద్రత విధానాలను రైతులకు సూచిస్తున్నారు. ఈ విధానంలో సాగు చేసిన పంటను రెండు విడతల్లోనే పూర్తిగా తీసుకునే అవకాశాలుండటంతో కూలీల సంఖ్య తగ్గుతుంది. ఐదారేళ్లుగా రైతులు ఈ విధానంలో పత్తిసాగుకు మొగ్గుచూపుతున్నారు. క్రమంగా రైతుల సంఖ్య పెరుగుతోంది.


