భూముల విలువ మరింత! | - | Sakshi
Sakshi News home page

భూముల విలువ మరింత!

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

● రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి.. ● వ్యవసాయేతర భూములపై 15 నుంచి వంద శాతం పెంపు ● వ్యవసాయ భూముల విలువ సైతం రెట్టింపు

నేడు రాత్రి 7.30 గంటల వరకు..

● రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి.. ● వ్యవసాయేతర భూములపై 15 నుంచి వంద శాతం పెంపు ● వ్యవసాయ భూముల విలువ సైతం రెట్టింపు

ఖమ్మంమయూరిసెంటర్‌: భూముల మార్కెట్‌ విలువల పెంపుపై కొద్దినెలలుగా తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తేదీ నుంచి సవరించిన భూముల మార్కెట్‌ విలువ అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోనూ కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. వ్యవసాయ భూముల విలువలను అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యాన తహసీల్దార్లు, వ్యవసాయేతర భూములు, ప్లాట్లు, ఇళ్ల మార్కెట్‌ విలువలను జిల్లా రిజిస్ట్రార్‌ ఆధ్వర్యాన సబ్‌ రిజిస్ట్రార్లు ప్రత్యేక ఫార్మాట్‌లో నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధి 763 గ్రామాల్లో మార్కెట్‌ విలువలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిసింది.

తక్కువ ఉంటే ఎక్కువగా..

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువలను 15 శాతం నుంచి 100 శాతానికి పెంచినట్లు తెలుస్తోంది. గజం రూ.500 ధర ఉన్న ప్రాంతాల్లో వంద శాతం పెంచి రూ.వేయిగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఇప్పటికే అత్యధిక ధర ఉన్న ప్రాంతాల్లో 15 శాతం మేర మాత్రమే పెంచినట్లు తెలిసింది. తద్వారా ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో 15 శాతమే భూమి ధర పెరగనుంది. గాంధీచౌక్‌ ప్రాంతంలో గజం ధర రూ.49 వేల వరకు ఉండగా.. పెంపులో పెద్దగా వ్యత్యాసం ఉండదని తెలిసింది. ఇక వ్యవసాయ భూములకు సంబంధించి ధర రెట్టింపు చేసినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఎకరం ధర కనిష్టంగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల లోపు ఉండేలా సవరించినట్లు చర్చ జరుగుతోంది. ప్రధాన హైవేలు, పట్టణాలకు సమీపాన ఉన్న ప్రాంతాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ధర రెట్టింపు చేసినట్లు తెలిసింది.

ఈ నెల 5వ తేదీ శుక్రవారం నుంచి పెరిగిన భూముల మార్కెట్‌ ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో గురువారం పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యాన గురువారం ఉమ్మడి జిల్లాలోని 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ సేవలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. గత నెల 29వ తేదీ నుంచే కార్యాలయాల పనివేళల పొడిగింపు అమల్లో ఉంది. ఈ మేరకు బుధవారం వరకు ఖమ్మం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 408 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేయడంతో రూ.2,88,51,787 ఆదాయం సమకూరింది.

Advertisement
 
Advertisement
Advertisement