ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెరగాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెరగాలి

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నవీన్‌ నికోలస్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి విద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్షించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో నుంచి కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌, ఐటీఐలు, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్‌ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, విద్యాశాఖ కోఆర్డినేటర్లు సైదులు, సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి గ్రామసభలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. గురువారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై బుధవారం జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, గ్రామాలు, వార్డుల స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టడం లక్ష్యంగా గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈవీఎం గోదాం తనిఖీ

కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎంల గోదాంను కలెక్టర్‌ అంకిత్‌ బుధవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారుల సమక్షంలో గోదాం భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా పరిస్థితులను పరిశీలించారు. సీసీ కెమెరా నియంత్రణ గదిని సందర్శించి కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సూపరిండెంట్‌ రంగాప్రసాద్‌, మాస్టర్‌ ట్రైనర్‌ పూసపాటి సాయికృష్ణ, వివిధ పార్టీల ప్రతినిధులు లక్ష్మణ్‌ అగర్వాల్‌, జె.మోహనకృష్ణ, ఎస్‌.అనుదీప్‌, రాంబాబు, ఎన్ని కల విభాగం సిబ్బంది నవీన్‌, అశోక్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement
 
Advertisement
Advertisement