వ్యసనంలా సెల్‌ఫోన్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యసనంలా సెల్‌ఫోన్‌

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

● పక్కదారి పడుతున్న యువత ● మానసిక ఒత్తిడి.. ఆందోళనలో తల్లిదండ్రులు ● అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్న నిపుణులు

ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయొద్దు..

చిన్నారులపై అధిక ప్రభావం
● పక్కదారి పడుతున్న యువత ● మానసిక ఒత్తిడి.. ఆందోళనలో తల్లిదండ్రులు ● అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్న నిపుణులు

భద్రాచలంటౌన్‌: సాంకేతికత మనిషి జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ, నేడు సెల్‌ఫోన్‌ వినియోగం ఒక పెద్ద వ్యసనంగా మారుతూ ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు కేవలం సమాచార మార్పిడికి, అత్యవసరాలకు మాత్రమే పరిమితమైన మొబైల్‌.. నేడు ప్రతి ఒక్కరి చేతిలో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ప్రస్తుత రోజుల్లో ఒకే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి విడివిడిగా సెల్‌ఫోన్లు ఉండటం సర్వసాధారణమైంది. అయితే, పరిమితికి మించిన ఈ మొబైల్‌ వినియోగం ముఖ్యంగా చిన్నారులు, యువతపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతోందని విద్యావేత్తలు, వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మరోవైపు సెల్‌ఫోన్‌ వాడకం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు నడుపుతూ ఫోన్ల లో మాట్లాడటం, డ్రైవింగ్‌ చేస్తూనే మెసేజ్‌లు చూడటం వల్ల వాహనదారుల దృష్టి మళ్లుతోంది. ఈ అజాగ్రత్తల వల్ల నిత్యం ఎందరో రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి.

అవసరాల కంటే..

ఆకర్షణకే ఎక్కువ!

నిజానికి విద్య, ఉద్యోగాలు, బ్యాంకింగ్‌ లావాదేవీలు, టికెట్‌ బుకింగ్‌, ప్రభుత్వ సేవ లు వంటి అనేక రకాల నిత్య జీవిత అవసరాలకు మొబైళ్లు ఎంతో ఉపయోగపడుతున్నా యి. కానీ, అదే సమయంలో సోషల్‌ మీడి యా, ఆన్‌లైన్‌ గేమ్స్‌, అశ్లీల కంటెంట్‌, జూ దం వంటి ప్రమాదకరమైన అంశాల వైపు యువత మళ్తుతోంది. ముఖ్యంగా కరోనా సమయం నుంచి ఆన్‌లైన్‌ చదువుల పేరుతో పిల్లలకు కొనిచ్చిన ఫోన్లను.. కొందరు విద్యార్థులు కేవలం వినోదానికే పరిమితం చేస్తూ పక్కదారి పడుతుండటం తల్లిదండ్రులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

నెట్‌ లభ్యతతో పెరిగిన వినియోగం

ఇంటర్నెట్‌ డేటా చార్జీలు భారీగా తగ్గడంతో పాటు, టెలికాం కంపెనీలు అపరిమిత డేటా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావ డం ఈ వ్యసనానికి మరింత ఆజ్యం పోస్తోంది. దీనివల్ల యువతలో నెట్‌ వినియోగం రోజురోజుకూ హద్దులు దాటుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగామ్‌ రీల్స్‌ వంటి వాటితో పాటు పబ్‌జీ, ఫ్రీఫైర్‌ వంటి ఆన్‌లైన్‌ ఆటలపైనే రాత్రనక, పగలనక ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కొందరు యువకులు ఈ గేమ్స్‌, బెట్టింగ్‌లకు పూర్తిగా బానిసలై చేతిలో డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరం..

సెల్‌ఫోన్‌ వినియోగంతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాడుకలో నియంత్రణ లేకపోతే భవిష్యత్‌లో దుష్పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు మొబైల్‌ వినియోగంపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన మేరకే ఫోన్లు ఇచ్చి వారిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో మత్తు పదార్థాల తరహాలోనే పెరుగుతున్న ఈ సెల్‌ఫోన్‌ వ్యసనం.. రాబోయే తరాల భవిష్యత్‌కు ఒక కొత్త సవాలుగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ద్విచక్ర వాహనాలు, కార్లు నడుపుతూ సెల్‌ఫోన్‌ మాట్లాడటం చట్టప్రకారం నేరం. డ్రైవింగ్‌ చేసేటప్పుడు సెల్‌ఫోన్‌ వాడటం వల్ల డ్రైవర్‌ దృష్టి మరలి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. సెల్‌ఫోన్‌ చూస్తూ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తాం. ప్రయాణంలో అత్యవసర ఫోన్‌ కాల్స్‌ వస్తే.. వాహనాన్ని పక్కన ఆపి మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణకు సహకరించాలి. – సంగం వెంకటపుల్లయ్య,

ఎంవీఐ, భద్రాచలం

Advertisement
 
Advertisement
Advertisement