సింగరేణి విరాజిల్లాలి
రుద్రంపూర్: సింగరేణి సంస్థ 137 ఏళ్లుగా బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో నిలుస్తుండగా.. మరో వందేళ్లు ఇలాగే కొనసాగేలా అందరూ సహకరించాలని డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సింగరేణి ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన, ఆ తర్వాత ప్రకాశం స్టేడియంలో కూడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత స్టేడియం నుంచి బస్టాండ్ సెంటర్‌లోని అమరవీరుల స్తూపం వరకు తెలంగాణ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులు రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న అభివృద్ధిలో సింగరేణి కీలకంగా నిలుస్తోందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి, సౌరశక్తి, పవనశక్తి, అరుదైన ఖనిజాల అన్వేషణ వంటి రంగాలలో అడుగులు వేస్తున్న నేపథ్యాన కార్మికులు మరింత శ్రద్ధ వహిస్తూ వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం 16 మంది ఉత్తమ కార్మికులను సన్మానించగా, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలంరించాయి. ఇక సాయంత్రం కూడా ప్రకాశం స్టేడియంలో జరిగిన వేడుకల్లో డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. అనంతరం సినీ, టీవీ గాయకులు, కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ (ఈ అండ్ ఎం) తిరుమల్‌రావు, నాయకులు, అధికారులు రాజ్‌కుమార్, త్యాగరాజన్, రమణమూర్తి, టి.లక్ష్మీపతిగౌడ్, కె.అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హాజరుకాని సీఎండీ, డైరెక్టర్ (పా)
సింగరేణికి సంబంధించి తెలంగాణ ఆవిర్భావ వేడుకల ప్రధాన కార్యక్రమం కొత్తగూడెంలో నిర్వహించగా సీఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్, డైరెక్టర్ (పా) గౌతం పోట్రు హాజరుకాలేదు. దీంతో కార్మికులు నిరాశకు లోనయ్యారు. మరోపక్క కార్మికులకు సెలవు ప్రకటించకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల గనుల పరిశీలనకు రాగా ఆదివారం అయినప్పటికీ ఏరియాలో అందరికి ప్లేడే నిర్వహించి డ్యూటీలు వేశారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని విస్మరించడంపై పలువురు తప్పుట్టారు.
ఆవిర్భావ వేడుకల్లో డైరెక్టర్ వెంకటేశ్వర్లు


