రామాలయంలో సుదర్శన హోమం
భద్రాచలం: రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం, ఇతర పూజలు జరిపారు. అనంతరం బేడా మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పూజల్లో ఆలయ ఈఓ దామోదర్‌రావు, ప్రధానార్చకులు విజయరాఘవన్, కోటి రామస్వరూప్, అర్చకులు, పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటలోని సబ్ స్టేషన్ ఆవరణలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏడీఈ వెంకట రత్నం తెలిపారు. ఉదయం 10–30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే సదస్సులో సీజీఆర్‌ఎఫ్ చైర్ పర్సన్ వేణుగోపాలచారి పాల్గొని విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈమేరకు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఏపీపీగా అజయ్‌కుమార్
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొట్టే అజయ్‌కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లి నుంచి ఆయన బదిలీపై కొత్తగూడెం వచ్చారు. ఇప్పటికే కొత్తగూడెం మొదటి, రెండో అదనపు జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల ఏపీపీగా నర్సింగోజు అనిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
డిపెండెంట్ ఉద్యోగాల కోసం నేడు ధర్నా
రుద్రంపూర్: సింగరేణిలో సుమారు 350 మంది కార్మికులు ఏడాదిన్నర క్రితం మెడికల్ అన్‌ఫిట్ అయినా, వారి పిల్లలకు ఇంటర్వ్యూ నిర్వహించినా పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం చేయడం సరికాదని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ బుధవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే ధర్నాలో ఏఐటీయూసీ నాయకులు, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. కాగా, యాజమాన్యం స్పందించి నియామక పత్రాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన ఓ ప్రకటనలో హెచ్చరించారు.
ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం
కామేపల్లి: కామేపల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో శ్రీ హరిహర గురుక్షేత్రం(శివాలయం) నిర్మించనుండగా, తాళ్లగూడెంకు చెందిన పుచ్చకాయల కృష్ణ – భద్రమ్మ దంపతులు రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు చెక్కు మంగళవారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేయగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.శివాజీ, పి.కోటయ్య, వి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.


