ఇల్లెందు: రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయనుందని, ఆ దిశగా మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానికంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛన్లు ఇలా పలు పథకాల వల్ల మహిళలు స్వశక్తితో నిలబడగలుతున్నారని తెలిపారు. మహిళా సంఘాలకు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో అప్పగించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 4,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి పేదలను ఆదుకుంటున్నామని చెప్పారు. పూసపల్లి ఓసీ ప్రారంభానికి కృషి జరుగుతుందని తెలిపారు. తనకు, తన కుటుంబానికి భూములు ఉన్నట్లు తప్పుడు ఆరోపణలు చేయటం తగదన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్‌మిత్ర, వైస్ చైర్మన్ పి.రాజు, మాజీ చైర్‌పర్సన్ అనసూర్య, బోళ్ల సూర్యం, మండల రాము, మడుగు సాంబమూర్తి, గాలిపల్లి స్వరూప పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం
జూలూరుపాడు: అన్నారుపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం మంగళవారం జరిగింది. సర్పంచ్ భూక్యా ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు, స్థానికులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రావణి, సెక్రటరీ రమణి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కృష్ణమూర్తి విగ్రహం ఏర్పాటు చేయాలి
పాల్వంచ: తెలంగాణ తొలి ఉద్యమకారుడు పోటు కృష్ణమూర్తి విగ్రహాన్ని ప్రభుత్వం పాల్వంచలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్‌జేకే అహ్మద్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో పోటు కృష్ణమూర్తి సతీమణి లక్ష్మిని సన్మానించారు. మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో పోటు కృష్ణమూర్తి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో సయ్యద్ అక్బర్, జారే భిక్షం, ఆళ్ల రాఘవ, నయీం, నాయుడు, ఆసీఫ్, పోటు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం
రుద్రంపూర్: కార్మిక ప్రాంతం రామవరం సీఆర్‌పీ క్యాంప్‌కు చెందిన సృజన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యఖర్చులు సుమారు రూ.3 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆటోయూనియన్ నాయకులు మర్రి కృష్ణ ఆధ్వర్యంలో రూ.27,500 చందాలు సేకరించి మంగళవారం సృజన్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి అశోక్, ఇమ్రాన్ అలీ, జాన్‌పాల్, గాంధీ,భరత్ తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
పాల్వంచరూరల్: డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాండురంగాపురం తండాకు చెందిన బానోతు హిందు (22) సోమవారం అర్ధరాత్రి చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె తండ్రి తులసీరాం మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ.సురేశ్ తెలిపారు.
విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి
టేకులపల్లి: సులానగర్ గ్రామంలో మంగళవారం గాలిదుమారంతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గ్రామానికి చెందిన కోరం సంపత్‌కు చెందిన దుక్కిటెద్దు అటుగా వెళ్లడంతో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఎద్దు విలువ రూ.లక్ష ఉంటుందని, వ్యవసాయానికి, జీవనాధారానికి ప్రధాన ఉండేదని, బాధిత రైతును ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తగిన నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.


