కొత్తగూడెం కార్పొరేషన్..
పుష్కర కాలం..
12 ఏళ్ల స్వరాష్ట్రంలో జిల్లాలో పలు మార్పులు
విద్యా, వైద్య రంగాల్లో సానుకూల పరిస్థితి పర్వాలేదనిపించేలా పారిశ్రామిక ప్రగతి రూ.వేల కోట్లు ఖర్చైనా కనిపించని కొత్త ఆయకట్టు రవాణా రంగంలో మిశ్రమ ఫలితాలు
గడిచిన పన్నెండేళ్లలో విద్యారంగంలో జిల్లా సానుకూల ఫలితాలు సాధించిందనే చెప్పుకోవాలి. రాష్ట్ర విభజన సమయంలో మంజూరైన గిరిజన వర్సిటీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థాపిస్తారనే ప్రచారం జరిగినా.. చివరకు ములుగుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేశారు. మరోవైపు అశ్వారావుపేటకు హార్టికల్చర్ కాలేజీ మంజూరైంది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు మంజూరైనా ఇంకా నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. ఇల్లెందుకు ఏటీసీ మంజూరై రెండేళ్లు దాటినా క్లాసులు ప్రారంభం కాలేదు. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ పనులు ఎక్కడా మొదలు కాలేదు. కొన్ని చోట్ల స్థల సేకరణే కొలిక్కి రాలేదు.
జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు మంజూరయ్యాయి. దీంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. ప్రస్తుతానికి మెడికల్ కాలేజీ ఫలాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినా రాబోయే రోజుల్లో కచ్చితంగా ఈ పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. అశ్వారావుపేట, ఇల్లెందు, బూర్గంపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు వంద పడకల ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. మారుమూల చర్ల ఆస్పత్రిలో క్రమం తప్పకుండా ప్రసవాలు జరుగుతున్నాయి. భద్రాచలం పెద్దాసుపత్రి ఎప్పటిలాగే మూడు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ ఆస్పత్రిని కేంద్రం నిధులతో ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
తెలంగాణ వచ్చిన రెండేళ్లకే 2016లో సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. గడిచిన పదేళ్లలో సుమా రు రూ.20 వేల కోట్ల వరకు చేసినా జిల్లాలో కొత్తగా ఒక్క ఎకరం కూడా ఆయకట్టు రాలేదు. యాతాలకుంట టన్నెల్ పూర్తైనందున త్వరలో సీతారామ వల్ల గరిష్టంగా లక్ష ఎకరాలు ఒక్క అశ్వారావుపేటలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగూడెం పాక్షికంగా లబ్ధిపొందనుంది. భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకర్గాల్లో కొత్త ఆయకట్టు విషయంలో ప్రభుత్వం తరఫున ఎటువంటి హామీ లేదు.
స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో పారిశ్రామిక ప్రగతికి కేరాఫ్ అడ్రెస్‌గా హైదరాబాద్, వరంగల్ నగరాల సరసన కొత్తగూడెం నిలిచింది. 90వ దశకం తర్వాత క్రమేపీ ప్రభుత్వ రంగంలో ఉన్న అనేక పరిశ్రమలు మూత పడ్డాయి. ప్రైవేటు సెక్టారులో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా లాకౌట్ ప్రకటించి కనుమరుగైపోయాయి. ఈ తరుణంలో 1080 మెగావాట్ల సామర్థ్యంతో మణుగూరులో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కావడం ఓ సానుకూల అంశంగా పేర్కొనవచ్చు. అప్పారావుపేటలో 90 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చింది. మరోవైపు కేటీపీఎస్ విస్తరణ ఎండమావిగానే ఉండిపోయింది. ఆశించిన స్థాయిలో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందులలో సింగరేణి గనుల విస్తరణ జరగడం లేదు. సారపాక ఐటీసీ విస్తరణ సైతం మధ్యలోనే ఆగిపోయింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన డిమాండ్ పూర్తిగా అటకెక్కింది.
మూడు రాష్ట్రాల సరిహద్దులో జిల్లా ఉంది. గడిచిన పుష్కర కాలంలో ఖమ్మం–దేవరపల్లి హైవే కారణంగా అశ్వారావుపేటకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడింది. ఎన్‌హెచ్ 930పీ వల్ల మహబూబాబాద్–ఇల్లెందు–కొత్తగూడెం మార్గం అప్‌గ్రేడ్ అవడం సానుకూల అంశం. ఇక పాల్వంచ–దమ్మపేట, మోరంపల్లి బంజర – మణుగూరు – ఏటూరునాగారం, కొత్తగూడెం – వైరా రోడ్లను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని పలు మార్లు కేంద్రానికి వినతులు వెళ్లినా సానుకూల ఫలితాలు రాలేదు. రైల్వే పరంగా కొత్తగూడెం–సత్తుపల్లి మార్గం పూర్తయింది. భద్రాచలం–మల్కన్‌గిరి లైను కొత్తగా మంజూరైంది. మణుగూరు–రామగుండం మార్గాన్ని పీపీపీ మోడల్‌లో నిర్మించాలనే నిర్ణయం జరిగింది. జిల్లాకు మరిన్ని కొత్త రైళ్లు మంజూరు కావాల్సిన అవసరం ఉంది. ఇల్లెందులో కొత్తగా ఆర్టీసీ బస్‌డిపో రాగా అశ్వారావుపేటలో కొత్త డిపో కోసం సర్వే మొదలైంది.
కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలను కలుపుతూ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. కొత్తగా అశ్వారావుపేట మున్సిపాలిటీ హోదా సాధించింది. మణుగూరు, భద్రాచలంల విషయంలో చట్టపరమైన చిక్కుముడులు గడిచిన పుష్కరకాలంలో వీడలేదు. భద్రాచలం సబ్ డివిజన్ నుంచి ఏపీలో కలిసిన ఏడు మండలాల నుంచి కనీసం ఐదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలిపే అంశం కొలిక్కి రాలేదు. ఇల్లెందుకు రెవెన్యూ డివిజన్ హోదా బోడు, కొమురారం, మొండికుంట కొత్త మండలాల డిమాండ్లు కూడా నెరవేరలేదు.


