ముత్తంగి అలంకరణలో రామయ్య | - | Sakshi
Sakshi News home page

ముత్తంగి అలంకరణలో రామయ్య

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

భద్రగిరి మార్ట్‌లో

నోటు పుస్తకాలు

భద్రాచలం: పాఠశాలల్లో అవసరమైన నోట్‌ పుస్తకాలు, స్యూల్‌ బ్యాగులు, ఇతర సామగ్రిని భద్రగిరి మార్ట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్నింటిని అందుబాటులో ఉంచామని, తల్లిదండ్రులు గమనించాలని పేర్కొన్నారు.

ఐటీడీఏ డీడీగా చందన

భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖ డీడీగా చందన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి డీడీగా విధులు నిర్వహిస్తున్న అశోక్‌ నుంచి ఆమె చార్జ్‌ తీసుకున్నారు. తొలుత ఆమె ఐటీడీఏ పీఓ రాహుల్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యల పరిష్కారాని కృషి చేయాలని పీఓ సూచించారు.

ఇంటర్‌ తరగతులు

ప్రారంభం

కొత్తగూడెంఅర్బన్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో 14 ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ కళాశాలలు ఉండగా, మొదటి రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు క్లాసులకు కొందరు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి అన్ని కళాశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకొని క్లాసులకు హాజరైన మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. మరికొన్ని కళాశాలల్లో మంగళవారం నుంచి పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు.

పాల్వంచ ఇన్‌చార్జి ఎఫ్‌డీఓగా డీఎఫ్‌ఓకు బాధ్యతలు

పాల్వంచరూరల్‌: పాల్వంచ అటవీ డివిజన్‌ ఇన్‌చార్జి ఎఫ్‌డీఓగా కొత్తగూడెం డీఎఫ్‌ఓ జి.కృష్ణాగౌడ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి ఎఫ్‌డీఓ కట్టా దామోదర్‌రెడ్డి సూర్యాపేట డీఎఫ్‌ఓగా బదిలీ అయిన విషయం విదిత మే. ఇక వైల్డ్‌లైఫ్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు భద్రాచలం సూపరిటెండెంట్‌గా, అక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్‌ రామకృష్ణ వైల్డ్‌లైఫ్‌ విభాగానికి బదిలీఅయ్యారు.

ఇల్లెందు విద్యార్థికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంక్‌

ఇల్లెందురూరల్‌: మండలంలోని సుభాష్‌నగర్‌ గ్రామపంచాయతీ కొమరంభీం కాలనీకి చెందిన మోకాళ్ల శరత్‌చంద్ర సోమవారం వెలువడిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 382వ ర్యాంకు, ఎస్టీ కేట గిరీలో 4వ ర్యాంకు సాధించాడు. ఎప్‌సెట్‌లో 52వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయిలో 452వ ర్యాంక్‌, ఎస్టీ కేటగిరీలో 4వ ర్యాంకు సాధించిన విషయం విదితమే. విద్యార్థిని తల్లిదండ్రులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement