● చింతూరు సబ్‌కలెక్టర్, పీఓలకు భద్రాచల రామాలయ అధికారుల వినతి ● త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చిన ఏపీ అధికారులు
భద్రాచలం: అన్యాక్రాంతం, అనుమతిలేని నిర్మాణాలతో 900 ఎకరాల రామయ్య భూములు కబ్జాకు గురవుతున్నాయి. రక్షణ కల్పించాలని భద్రాచలం రామాలయ అధికారులు ఏపీ ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఆలయ ఈవో దామోదర్‌రావు మూడు రోజుల క్రితం రంపచోడవరం కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్, చింతూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం మక్వాల్‌ను కలిసి సమస్య విన్నవించారు. దేవస్థాన భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని, భూముల యాజమాన్యం, పరిరక్షణ, నిర్వహణ తదితర అంశాలను వివరించారు.
త్వరలో మళ్లీ కమిటీ ఏర్పాటు
పది రోజుల్లో సంబంధిత రెవెన్యూ, దేవాదాయ, పోలీసు, ఇతర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చింతూరు సబ్ కలెక్టర్ ఈఓకు హామీ ఇచ్చారు. అనంతరం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విధి విధానాలను ప్రకటించినా క్షేత్రస్థాయి పరిశీలనకు మాత్రం రాలేదు. అంతర్రాష్ట్ర సమస్యగా మారడం, చట్టాల్లోని లొసుగుల ఆధారంగా అక్రమ నిర్మాణాలు నిరంతరం వెలుస్తూనే ఉన్నాయి. దీంతో దేవస్థానం అధికారులు నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది.
ఏపీ నుంచి ఆదేశాలు వస్తేనే..
రంపచోడవరం, చింతూరు ఉన్నతాధికారులను దేవస్థానం అధికార వర్గాలు కలిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, సదరు దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలు వస్తేనే పురుషోత్తపట్నం భూముల్లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విభజన నుంచి సమస్య జఠిలంగా మారినా పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు. ఫలితంగా వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వాగ్వాదాలు, తోపులోటలతో రామయ్య భూములు యుద్ధక్షేత్రాలుగా మారుతున్నాయి.


