మొదలుకాని పేషంట్ వెయిటింగ్ హాల్ ఇంకా కొనసాగుతున్న పనులు జనరల్ వార్డు పనులకు ముహూర్తం ఎప్పుడో? ఇల్లెందు ఆస్పత్రిలో తీరని సమస్యలు
ఇల్లెందు: ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో పేషంట్ వెయింట్ హాల్, జనరల్ వార్డు, బర్త్ వెయింట్ హాల్ నిర్మాణ ప్రతిపాదనలకు ఆరు నెలలు దాటినా అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రికి వచ్చిన సమయాన ఈ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు మంత్రి సూచనలతో అధికారులు అంచనాలు రూపొందించినా ఆచరణలోకి మాత్రం రాలేదు.
వర్షాకాలం వస్తే గోస..
వైద్యశాలకు వచ్చే గర్భిణుల వెంట సహాయకులు ఉండటానికి బర్త్ వెయిటింగ్ హాల్ కోసం ఏర్పాట్లు చేశారు. అయితే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణులు ఒకటి రెండు రోజులు వేచి ఉండాలంటే వెయిటింగ్ హాల్ ఉపయోగపడుతుంది. అయితే అందుకు తగిన సదుపాయాలు కల్పించాలని నిర్ణయించినా ఆచరణలో సాధ్యం కాలేదు.
రోగుల సహాయకుల అవస్థలు..
వైద్యశాలకు వచ్చే రోగుల సహాయకులకు ఉండటానికి ఇబ్బందిగా మారింది. రోగుల వద్ద ఉండటం వల్ల నర్సుల విధులకు ఆటంకంగా మారుతోంది. రోగుల బెడ్ల వద్ద సహాయకులను బయటకు పంపిస్తున్నారు. ఆరు బయట చెట్ల కింద ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు. వెయిటింగ్ హాల్ ఉంటే వారికి ఉపయోగపడేది. ఈ మేరకు షెడ్డు నిర్మించాలని ప్రతిపాదించినా, ఆరు నెలలు దాటినా జాప్యం వీడడం లేదు.
జనరల్ వార్డు కూడా..
వైద్యశాలలో రోగులకు తగ్గట్టు బెడ్‌లు అందుబాటులో లేవు. రోజురోజుకూ రోగుల రాక పెరిగిపోతోంది. కనీసం 20 బెడ్లు కూడా ఏర్పాటు చేసుకునేంత సదుపాయం ఈ వైద్యశాలలో లేదు. ఆరు బయట వరండాలో రోగులను ఉంచాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టెలా జనరల్ వార్డు నిర్మాణం చేయాలని వైద్యులు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి సూచనల మేరకు ఐటీడీఏ పీఓ రాహుల్ పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆరు నెలలు గడిచినా జనరల్ వార్డు నిర్మాణానికి నోచుకోలేదు.
రెనోవేషన్ పూర్తయింది..
ఈ విషయమై వైద్యశాల సూపరింటెండెంట్ హర్షవర్దన్‌ను వివరణ కోరగా గుండాలలో రెండు 108 అంబులెన్సులు ఉంటే ఒకటి ఇల్లెందుకు కేటాయించారని తెలిపారు. ఇక బర్త్ వెయిటింగ్ హాల్ రెనోవేషన్ పూర్తయింది. జనరల్ వార్డు, పేషంట్ వెయింగ్ హాల్ నిర్మాణం మాత్రం జరగాల్సి ఉంది.


