జూలూరుపాడు: పొగాకు ఆరోగ్యానికి హానికరమని, అందులోని నికోటిన్ అనే రసాయనానికి ప్రజలు బానిసలుగా మారతారని డీఎంహెచ్‌ఓ తుకారంరాథోడ్ తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు, వైద్యసిబ్బంది నిర్వహించిన అవగాహన ర్యాలీలో డీఎంహెచ్‌ఓ పాల్గొని మాట్లాడారు. పొగాకు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగడం, అంబర్లు, గుట్కాలు, పాన్ పరాగ్(మసాలా)లు వంటి ఉత్పత్తులను వాడటం వల్ల నోరు, నాలుక, గొంతు, ఊపిరితిత్తులు, ఆహార నాళం, పొట్ట, మూత్రాశయం కేన్సర్ సోకడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పొగ తాగడం, పీల్చడంతో ఆరోగ్యం దెబ్బతింటుందని, యువకులు ధూమపానం చేయడం వల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుందని వెల్లడించారు. ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ భూతాన్ని తరమి కొట్టేందుకు ప్రజల్లో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. కాగా, జూలూరుపాడు ఏఎన్‌ఎం మంగమ్మ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి డీఎంహెచ్‌ఓ తుకారంరాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎం మంగమ్మను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు, బి.వెంకటేశ్, ఆర్‌బీఎస్కే డాక్టర్ తబుసం, ఫార్మసిస్టు జి.శశికళ, హెచ్‌ఎస్ రత్నకుమార్, హెచ్‌వీ రాధిక, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.


