సూపర్‌బజార్(కొత్తగూడెం): పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శాసీ్త్రయంగా సర్వే జరగాలని బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పర్యటన జరుగనున్న నేపథ్యంలో గోదావరి బ్యాక్ వాటర్‌పై అడ్డగోలుగా సర్వే నిర్వహిస్తే అశ్వాపురం హెవీవాటర్ ప్లాంట్‌తో పాటు బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం నీట మునిగే ప్రమాదం ఉందని, పొలాలు ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాక్ వాటర్ కారణంగా ముర్రేడు, కిన్నెరసాని కూడా నిండి ప్రవహిస్తాయన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. సమావేశంలో దిండిగాల రాజేందర్, రాజుగౌడ్, మల్లెల రవిచంద్ర, కొట్టి వెంకటేశ్వర్లు, అనుదీప్, దామోదర్, హుస్సేన్, లావుడ్యా సత్యనారాయణ, రాజేశ్, సింధు తపస్వి, మల్లెల స్వప్న తదితరులు పాల్గొన్నారు.


