‘ప్రైవేట్‌’కు పచ్చజెండా | - | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’కు పచ్చజెండా

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

11 ఏళ్లలో పెట్టుబడి వెనక్కి..

లైన్‌ వివరాలు, అంచనాలు

దేశవ్యాప్తంగా ఆరు కొత్త లైన్ల ఎంపిక జాబితాలో మణుగూరు– రామగుండం లైన్‌..

రైళ్లు పునరుద్ధరించాలి

రైల్వేలో ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా బాటలు వేస్తోంది. కీలకమైన ట్రాక్‌ నిర్మాణ పనుల్లోనూ ప్రైవేట్‌ రంగానికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆరు లైన్లను ఎంపిక చేయగా, అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మణుగూరు–రామగుండం లైన్‌ కూడా ఉంది. నిర్మాణం పూర్తయ్యాక 11 ఏళ్లలో పెట్టుబడి తిరిగి వస్తుందని రైల్వేశాఖ భావిస్తోంది.

–సాక్షి ప్రతినిధి,

భద్రాద్రి కొత్తగూడెం

నత్తనడకన పనులు

రైల్వే మౌలిక స్వరూపంలో భాగమైన ట్రాక్‌ల నిర్మాణం, ఇంజన్లు, రోలింగ్‌ స్టాక్‌ల విషయంలో ప్రైవేట్‌కు పచ్చ జెండా ఊపాలని గతంలో ప్రయత్నించినా ప్రతిపక్షాలు, రైల్వే సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. కానీ, అత్యంత ఖర్చుతో కూడుకున్న ట్రాక్‌ల నిర్మాణం కాలక్రమేణా రైల్వేకు సవాల్‌గా మారింది. దీంతో గడిచిన రెండు దశాబ్దాలుగా ట్రాక్‌ల నిర్మాణ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా, నిర్మాణ వ్యయాన్ని పంచుకోవాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను రైల్వేశాఖ కోరుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం, భద్రాచలంరోడ్‌ – సత్తుపల్లి లైన్‌ నిర్మాణ వ్యయంలో సింగరేణి సగం ఖర్చు భరించాయి. భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విడుదల విషయంలో వెనకడుగు వేస్తున్నాయి. ఫలితంగా కొత్త లైన్ల నిర్మాణ పనులు ఆలస్యంగా ప్రారంభం కావడం, ఒక వేళ మొదలైనా అరకొర నిధులతో ఏళ్ల తరబడి కొనసాగడం పరిపాటిగా మారింది.

పీపీపీఏసీ సమావేశలో సూత్రప్రాయంగా

అంగీకారం

గత ఏప్రిల్‌ 10న న్యూఢిల్లీలో రైల్వే బోర్డు ఆధ్వర్యంలో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పీపీపీఏసీ) 144వ సమావేశం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచేందుకు ప్రైవేట్‌ ప్లేయర్లకు పార్టనర్‌షిప్‌ ఇవ్వాలని సూత్రప్రాయంగా బోర్డు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆరు కొత్త లైన్లను పీపీపీ పెట్టుబడుల కోసం ఎంపిక చేయగా, అందులో దక్షిణ మధ్య రైల్వే పరిఽధిలో 207 కి.మీ నిడివి కలిగిన మణుగూరు–రామగుండం లైన్‌ కూడా ఉంది. దీంతోపాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సొంత రాష్ట్రమైన ఒడిశాలో విస్తరించిన ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలోని బుధపాంక్‌–లుబూరి (113 కి.మీ), కోరాపూట్‌ – రాయగడ(49 కి.మీ), బలరాం – టెంటులోయ్‌ (50 కి.మీ), జైపూర్‌ – దమారా (101 కి.మీ), పకూర్‌/నగర్‌నబి – గొడ్దా ( 127 కి.మీ ఈస్టర్న్‌ రైల్వే) లైన్లను కూడా ఎంపిక చేసింది.

20 ఏళ్లుగా ముందుకు సాగని రామగుండం లైన్‌

లాలూప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో సుమారు 20 ఏళ్ల క్రితం రామగుండం–మణుగూరు లైన్‌ నిర్మాణాన్ని బడ్జెట్‌లో చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు మంత్రులు మారినా పనులు మొదలు కాలేదు. సర్వేలు జరపడం, ఆపై బడ్జెట్‌ అంచనాలు పెరగడం మినహా పురోగతిలేదు. చివరిసారిగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గతేడాది డిసెంబర్‌లో సమస్యను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, రూ.4 వేల కోట్లు ఖర్చయ్యే లైన్‌ పనులు త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. కానీ, అనూహ్యంగా లైన్‌ పీపీపీ పరిధిలోకి వెళ్లింది.

ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5,818 కోట్లు వ్యయం అవుతుంది. మొదటి ఏడాది భూసేకరణ పనులు పూర్తి చేసి, మిగిలిన నాలుగేళ్లలో ట్రాక్‌ నిర్మాణం పూర్తి చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్గం గుండా బొగ్గు, ధాన్యాలు, సిమెంట్‌, ఖనిజాలు ప్రధానంగా రవాణా చేయాలని భావిస్తోంది. నిర్మాణం పూర్తయ్యాక తొలి ఏడాది 13 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.456 కోట్ల ఆదాయం వస్తుంది. ఆ తర్వాత క్రమంగా రవాణా సామర్థ్యం పెంచుకుంటూ 11 ఏళ్లు పూర్తయ్యే సరికి సాలీనా సరుకు రవాణా 20 మిలియన్‌ టన్నులకు చేరుకుని రూ.1,139 కోట్ల వార్షిక ఆదాయం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ప్రాజెక్ట్‌ను ఐదేళ్లలో పూర్తి చేస్తే, ఆ తర్వాత పదకొండేళ్లలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని రైల్వే లెక్కలు చెబుతున్నాయి.

లైన్‌ మణుగూరు–రామగుండం

ట్రాక్‌ నిడివి 207 కి.మీ.

ప్రాజెక్ట్‌ వ్యయం రూ. 5,818 కోట్లు

ట్రాక్‌ గరిష్ట వేగ సామర్థ్యం 110 కి.మీ

నిర్మాణ సమయం ఐదేళ్లు

పీపీపీ విధానంలో రైల్వే లైన్ల నిర్మాణం

జీఎంకు రైల్వే సమస్యల

ఉద్యమకారుల వినతి

మణుగూరు టౌన్‌: మణుగూరు రైల్వే స్టేషన్‌ నుంచి రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవకు శుక్రవారం సికింద్రాబాద్‌లో మణుగూరు రైల్వే సమస్యల ఉద్యమకారులు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. కోవిడ్‌కు ముందు మణుగూరు స్టేషన్‌ నుంచి నడిచిన రైళ్లను తిరిగి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. మణుగూరు–కాజీపేట ప్యాసింజర్‌(డైలీ), మణుగూరు– కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వయా డోర్నకల్‌, సోలాపూర్‌ రైళ్లు మణుగూరు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేవన్నారు. పవన్‌కుమార్‌, వినయ్‌, జ్ఞానేష్‌ నాయక్‌ వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement