‘కొత్త విద్య’ సంవత్సరంలోకి.. | - | Sakshi
Sakshi News home page

‘కొత్త విద్య’ సంవత్సరంలోకి..

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

నేటి నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ప్రారంభం

ఇప్పటికే కాలేజీలకు చేరిన పాఠ్యపుస్తకాలు

ఈసారి నుంచి విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం

కొత్తగా ఏసీఈ కోర్సు ప్రారంభం

కొత్తగూడెంఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యతోపాటు ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ బోధన అందిస్తుండగా, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు సైతం పంపిణీ చేస్తోంది. సోమవారం నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలుకానుండగా.. ఈసారి పాఠశాలల్లో మాదిరి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం అందించనున్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

మార్పులకు శ్రీకారం

ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచి సిలబస్‌లో మార్పు చేయడమేకాక విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు లబ్ధి జరగనుంది. ఇప్పటికే విద్యార్థులకు పంపిణీ చేసే ఉచిత పాఠ్యపుస్తకాలు కాలేజీలకు చేరాయి. కాగా ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఏసీఈ(అకౌంటెన్సీ, కామర్స్‌, ఎకనామిక్స్‌) కొత్త కోర్సు ప్రారంభించనుంది.

ఇంటర్నల్‌ మార్కులు

ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ బోధనలో మార్పులు తీసుకొస్తున్నారు. అలాగే, విద్యార్థులకు ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ పేరుతో ఈ అంతర్గత మార్కులు కేటాయిస్తారు. ఆర్ట్స్‌ గ్రూపులు, భాషా సబ్జెక్టుల్లో కూడా ఈ మార్కులు ఉంటాయి. విద్యార్థులు 80 మార్కుల ప్రశ్నపత్రానికి పరీక్ష రాస్తే, మిగతా 20 అంతర్గత మార్కులుగా అధ్యాపకులు వేయనున్నారు. కాగా, ఎంపీసీ విద్యార్థులకు (గణితంలో) 75 మార్కుల్లో 15 అంతర్గత మార్కులు కేటాయించారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ప్రథమ సంవత్సరంలోనూ ప్రాక్టికల్స్‌

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులకు మాత్రం ఇన్నాళ్లు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సైతం ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 30 మార్కులకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తుండగా.. ఇకపై ప్రథమ సంవత్సరంలో 15 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

టిఫిన్‌, భోజనం

ఇన్నాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలవుతోంది. పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఉదయం టిఫిన్‌ కూడా సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయాన జూనియర్‌ కాలేజీల విద్యార్థులకు సైతం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి అల్పాహారం, మధ్యాహ్నభోజనం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తద్వారా దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ఆకలి తీరుతుందని, చదువుపై శ్రద్ధ కనబరుస్తున్నారని భావిస్తున్నారు.

జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు : 14

ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 2,402 మంది

Advertisement
 
Advertisement
Advertisement