దాహం తీర్చేలా.. | - | Sakshi
Sakshi News home page

దాహం తీర్చేలా..

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

తొట్లలో నీళ్లు నింపుతున్నాం..

వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ చర్యలు

అడవిలో 493 తొట్లు, 54 చెక్‌డ్యామ్‌లు, 144 కుంటల నిర్మాణం

పాల్వంచరూరల్‌: కిన్నెరసాని అభయారణ్యంతోపాటు జిల్లా అటవీ ప్రాంతంలో వేసవి కాలంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఓ వైపు అడవుల విస్తీర్ణం పెంచుతూనే మరోవైపు వన్యప్రాణి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో జంతువులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గతంలో కాంపెన్సేటరీ ఏఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, ప్లానింగ్‌ అథారిటీ (క్యాంపా) నిధుల ద్వారా జిల్లాలో రూ.2.45 కోట్ల వ్యయంతో 94 నీటి కుంటలు, 54 చెక్‌ డ్యామ్‌లు, 36 నీటితొట్లను ఏర్పాటు చేసింది. గతేడాది రూ.19,41,400 వ్యయం చేసి 254 నీటితొట్లను నిర్మించారు.

వన్యప్రాణులకు నీటి సౌకర్యం

వేసవిలో ఎండలు తీవ్రమై అటవీ ప్రాంతంలోని నీటి వనరులైన వాగులు, వంకలు ఎండిపోవడంతో పలు రకాల వన్యప్రాణులు, పక్షులు నీటి కోసం అల్లాడుతాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ కొన్నేళ్లుగా అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అటవీశాఖ నీటితొట్ల (సాసర్‌ఫిట్లు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వేసవికాలం ముగిసేవరకు తొట్లలో నీళ్లు ఉండేలా సిబ్బందితో ట్యాంకర్ల ద్వారా నీరు నింపుతోంది. గతేడాది కూడా జిల్లా అటవీ ప్రాంతంలో 6 డివిజన్ల పరిధిలో రూ.5,96,000 వ్యయంతో 74 నీటితొట్లను నిర్మించారు. కొత్తగూడెం డివిజన్‌లో 60, ఇల్లెందులో 53, పాల్వంచలో 25, మణుగూరులో 48.. భద్రాచలంలో ఈఏడాది1, కిన్నెరసాని అభయారణ్యంలో ఈఏడాది 19 నీటితొట్లను నిర్మించారు. నీటి సౌకర్యంలేని ప్రాంతాలను గుర్తించి 171 నీటితొట్లు, 34 సోలార్‌ పంపుసెట్లు, 50 నీటికుంటలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

కుంటల్లోని నీరు సురక్షితమేనా..?

రెండు రోజుల క్రితం టేకులపల్లి మండలం కిష్టారం బీట్‌లోని సోలార్‌ పంపు నీటికుంటలో నీరు తాగిన పది గొర్రెలు తాగి వెంటనే మృతిచెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీళ్లు కలుషితమయ్యాయా? లేక వన్యప్రాణులను సంహరించేందుకు ఎవరైనా వేటగాళ్లు నీళ్లలో విషప్రయోగం చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగా వేటగాళ్లు జంతువులను విద్యుత్‌ ఉచ్చులు, నీటిలో విషప్రయోగం చేస్తూ వేటాడుతున్నట్లు సమాచారం.

వేసవికాలంలో వన్యప్రాణులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నీటితొట్లను ఏర్పాటు చేసి, వాటిలో వర్షాలు కురిసేవరకు నీళ్లు ఉండేవిధంగా ట్యాంకర్లతో నీటిని నింపుతున్నాం. అందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. జంతువులను వేటాడకుండా 30 బేస్‌క్యాంప్‌ల్లోని 150 మందికిపైగా సిబ్బంది, ఫారెస్ట్‌ సిబ్బందితో 24 గంటలూ పహారా కొనసాగుతోంది. కిష్టారం ఘటనలో పోస్టుమార్టం రిపోర్ట్‌ వస్తే తప్ప స్పష్టమైన కారణం చేప్పలేం.

–జి.కృష్ణాగౌడ్‌, డీఎఫ్‌ఓ

Advertisement
 
Advertisement
Advertisement