భద్రాచలం: సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో భద్రగిరి ఆదివారం రద్దీగా మారింది. వేసవి సెలువులు ముగింపునకు రావడంతో భద్రాచలం బాట పట్టారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి రామాలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
రామయ్యకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన
దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.


