● యథేచ్ఛగా ‘ఇందిరాసాగర్’ మట్టి అక్రమ రవాణా ● అడ్డుకున్న వ్యక్తిపై దాడులు ● పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేసిన ఆర్‌ఐ ● కాంగ్రెస్ నాయకుల హస్తముందనే ఆరోపణలు
అక్రమ మైనింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని, మైనింగ్‌కు వినియోగించిన యంత్రాలు, వాహనాలను అదుపులోకి తీసుకుంటాం. ఎంతటివారైనా సరే చర్యలు తీసుకుంటాం.
–రామనరేశ్, తహసీల్దార్, దమ్మపేట
అక్రమ మైనింగ్‌కు పాల్పడిన జేసీబీ, ట్రాక్టర్లను ఆర్‌ఐ వదిలేయమని చెబితేనే కానిస్టేబుల్ వెనక్కి వచ్చాడు. తహసీల్దార్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వాహనాలను అదుపులోకి తీసుకుంటాం. ఇందులో మా పాత్ర ఏమీలేదు.
–రాజేశ్‌కుమార్, ఎస్‌ఐ
దమ్మపేట: మండలంలోని పెద్దగొల్లగూడెం శివారులో కొద్ది రోజులుగా అక్రమ మట్టి మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మైనింగ్ వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తముందనే ప్రచారం సాగుతోంది. ఈ మైనింగ్‌ను అడ్డుకోబోయిన ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారని, దీంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని తెలిసింది. పెద్దగొల్లగూ డెం శివారులో ఇందిరాసాగర్ కాల్వ మట్టిని కొందరు అనుమతులు లేకుండా బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని సమా చారం. జేసీబీతో తవ్వి, పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి, మట్టి తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 28న మైనింగ్‌పై గ్రామస్తులు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి వెళ్లిన ఆర్‌ఐ పోలీసుల సాయంతో జేసీబీ, ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించకుండా మధ్యలోనే వదిలేశాడని విమర్శలు వస్తున్నాయి.
చర్యలు ఏవి..?
మైనింగ్ మాఫియాపై గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యు లు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిపై మాఫి యా ముఠా దుర్భాషలాడటమే కాక భౌతిక దాడు లకు పాల్పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ అక్రమ మైనింగ్ వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మైనింగ్‌కు పాల్పడిన వాహనాలను తహసీల్దార్ కార్యాలయానికి తరలించకుండా అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారనే చర్చ నడుస్తోంది. కాగా బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని, విచారణ నిర్వహిస్తున్నామని ఎస్‌ఐ రాజేశ్ కుమార్ చెబుతున్నారు.
ఆర్‌ఐ పాత్రపై ఆరోపణలు..
పెద్దగొల్లగూడెం శివారులో ఈనెల 28న భారీ ఎత్తున ఇందిరా సాగర్ మట్టిని బయటకు తరలిస్తున్నారని తహసీల్దార్ రామనరేశ్‌కు ఫిర్యాదు రాగా, ఘటనా స్థలానికి ఆర్‌ఐని వెళ్లాలని ఆదేశించారు. ఆయన కానిస్టేబుల్‌తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి జేసీబీ, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వాటిని దమ్మపేటలోని శివాలయం వరకు తీసుకొచ్చాక ట్రాక్టర్లను వదిలేస్తున్నామని కానిస్టేబుల్‌కు ఆర్‌ఐ చెప్పాడు. కానిస్టేబుల్ ఎస్‌ఐకి అదే విషయం చెప్పి వచ్చేశాడు. ట్రాక్టర్లను వదిలేసిన అనంతరం ఆర్‌ఐ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్లను వదిలేయడంపై దర్యాప్తు జరపాలని పలువురు కోరుతున్నారు. కాగా, ఇదే విషయమై ఆర్‌ఐని వివరణ కోరగా.. జేసీబీ, ఐదు ట్రాక్టర్లను పెద్దగొల్లగూడెం నుంచి దమ్మపేట శివాలయం సమీపానికి తీసుకురాగా.. డ్రైవర్లు వాహనాలను ఆపకుండా పరారయ్యారని.. కానిస్టేబుల్, తాను ఆపడానికి ప్రయత్నించినా ఆగలేదని తెలిపారు. కాగా, ఆర్‌ఐ ఇప్పటివరకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


