19 శాతం వెనుకంజ | - | Sakshi
Sakshi News home page

19 శాతం వెనుకంజ

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

ఓసీల్లో ప్రైవేట్‌ మోటార్లు !

సింగరేణిలో మే నెలలో 81 శాతమే బొగ్గు ఉత్పత్తి

నాలుగు ఏరియాల్లో

మాత్రం మెరుగు

రుద్రంపూర్‌: సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో 62 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో మే నెలకు 53,71,900 లక్షల టన్నుల లక్ష్యాన్ని కేటాయించగా.. సంస్థ పరిధిలో 12 ఏరియాల్లోని 18 ఓసీలు, 19 భూగర్భగనుల్లో 43,62,124 లక్షల టన్నులే సాధించడంతో 81శాతంగా నమోదైంది. రోజుకు 2,14,876 లక్షల టన్నులు ఉత్పతి చేయాల్సి ఉన్నా 1,54,402 లక్షల టన్నులకే పరిమితమవుతోంది. ఇక మే నెలలో మణుగురు ఏరియా 115 శాతం, ఆర్జీ–2 ఏరియా 102, సత్తుపల్లి, బెల్లంపల్లి ఏరియాలు 101శాతంతో అగ్రస్థానాన నిలిచాయి. మిగిలిన ఏరియాల్లో కొత్తగూడెం 67శాతం, ఇల్లెందు 63, మందమర్రి 54, రశ్రీరాంపూర్‌ 24, ఆర్జీ–1 ఏరియా 30, ఆర్జీ– 3 ఏరియా 47, అడ్రియాల ప్రాజెక్ట్‌ 43, భూపాలపల్లి 47శాతంతో వెనుకంజలో ఉన్నాయి.

వచ్చేది వర్షాకాలం

ఏటా వేసవిలో గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తికి అవకాశాలు ఉంటాయి. అలాంటి ఈ మే నెలలో నెలవారీ ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేని పరిస్థితి ఎదురైంది. ఎండాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలంలో ఉత్పత్తిపై మరింత ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. వర్షాకాలంలో ఓసీల్లో నీరు చేరి బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. రోజుల తరబడి వర్షం కొనసాగిందే ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం పడుతుంది. ఇదంతా వార్షిక లక్ష్యసాధనకు ఆటంకంగా మారే ప్రమాదముందని పలువురు చెబుతున్నారు.

గతేడాది భారీ వర్షాల కారణంగా ఓసీల్లో లక్షల క్యుసెక్కుల నీరు చేరింది. దీంతో సంస్థ తన సిబ్బంది ద్వారా సొంత మోటార్లతో నీరు తీయించింది. అయితే, అధిక వర్షపాతం నమోదవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం దక్కక సుమారు 8 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. సింగరేణి వ్యాప్తంగా 18 ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో వర్షపు నీరు బయటకు తీసే మో టార్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏరియా జీఎంలు సీఎండీ డాక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ ఆదేశాలతో త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement