మొన్న పదోన్నతి.. నిన్న ఉద్యోగ విరమణ | - | Sakshi
Sakshi News home page

మొన్న పదోన్నతి.. నిన్న ఉద్యోగ విరమణ

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

ఒకరోజు ఎస్‌ఐలుగా సర్వీసులో..

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి దక్కాలని కలలు కంటారు. ఈ మేరకు పదోన్నతి దక్కిందనే ఆశ తీరేలోగా కొత్త హోదాలో ఒకే రోజు సర్వీసుతో రిటైర్డ్‌ అయిన ఉదంతమిది. పోలీసు శాఖలో ఏఎస్‌ఐలుగా విధులు నిర్వర్తిస్తున్న కొదిరిపాక సత్యనారాయణ, జెడల సాదయ్యకు శనివారం ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించడమే కాక భద్రాద్రి జిల్లాకు కేటాయించారు. దీంతో వీరిద్దరు జిల్లాలో రిపోర్టు చేయగా.. ఆదివారం సర్వీస్‌ ముగియడంతో ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సత్యనారాయణ, సాదయ్యను అధికారులు సన్మానించి వీడ్కోలు పలికారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, కొత్తగూడెం త్రీటౌన్‌, వన్‌టౌన్‌ సీఐలు ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్‌, వెల్ఫేర్‌ ఆర్‌ఐ కృష్ణ, పోలీసు అధికారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ట్రాక్టర్లకు పూజలు

ఇల్లెందురూరల్‌: మరో వారం రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. దీంతో పల్లెల్లో రైతులు ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్నుతూ మంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఖరీఫ్‌లో సాగు సమృద్ధిగా సాగాలని, తమ ట్రాక్టర్లకు జోరుగా పని కలగాలని ఆకాంక్షిస్తూ మండలంలోని మిట్టపల్లి ప్రాంతానికి చెందిన 40 మంది ట్రాక్టర్‌ యజమానులు ఆదివారం మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో వాహన పూజ చేపట్టారు. అమ్మవారకి మేకలను బలిచ్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా ట్రాక్టర్లు నడవాలని వేడుకున్నారు.

అనుమానాస్పద స్థితిలో

కేటీపీఎస్‌ ఉద్యోగి మృతి

పాల్వంచ: అనుమానాస్పద స్థితిలో కేటీపీఎస్‌ ఉద్యోగి మృతి చెందాడు. పట్టణంలోని గట్టాయిగూడెంలో నివాసం ఉంటున్న మీసాల సునీల్‌కుమార్‌ (45) కేటీపీఎస్‌లో పనిచేస్తున్నాడు. అతను నివాసం ఉండే ఇంట్లో నుంచి ఆదివారం దుర్వాసన రావడంతో స్థానికులు పరిశీలించగా సునీల్‌కుమార్‌ గదిలో బెడ్‌పైనే మృతి చెంది కనిపించాడు. మూడు రోజుల క్రితమే చనిపోగా శరీరం ఉబ్బి వాసన వస్తున్నట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దంపతుల మధ్య మనస్పర్దలు రావడంతో భార్య వెళ్లిపోయిందని, దీంతో అతను ఒంటరిగానే ఉంటున్నట్లు తెలిసింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులను వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు రాలేదని, ఎలా మృతి చెందాడనేది దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement