పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసానికి ఆదివారం జిల్లానలు మూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 457 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.23,905 ఆదాయం.. 260 మంది బోటుషికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,810 ఆదాయం లభించిందని నిర్వాహకులు తెలిపారు.
అగ్నివీర్–జీడీ
ఉద్యోగానికి ఎంపిక
కరకగూడెం: మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఆర్మీలో అగ్నివీర్–జీడీ (జనరల్ డ్యూటీ) ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గతంలో రాత, శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించగా, శనివారం రాత్రి ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలు విడుదల చేసింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తండ్రి రఫీక్ పాషా ప్రోత్సాహంతో ఆర్మీకి ఎంపికయ్యాడు. కాగా ఇమ్రాన్ డిగ్రీ చదువుతున్నాడు.ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
సింగరేణిలో
అధికారుల బదిలీ
రుద్రంపూర్: సింగరేణి సంస్థవ్యాప్తంగా 12 ఏరియాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులను యాజమాన్యం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీఅయిన వారిలో 117 మంది మైనింగ్ విభాగం అధికారులు, 30 మంది పర్సనల్ విభాగం అధికారులు, 68 మంది ఈ అండ్ ఎం విభాగం అధికారులు ఉన్నారు. వీరిలో జీఎం, ఏజీఎంలు, డీజీఎంలు, డీవైజీఎంలు, అడిషనల్ మేనేజర్లు, అండర్ మేనేజర్లు ఉన్నారు. వీరందరూ నిర్దేశించిన గడువులోగా కేటాయించిన స్థానంలో రిపోర్టు చేయాలని యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రతిభతోనే గుర్తింపు, గౌరవం
వైరా: విద్యార్థులు చదువులో ప్రతిభ చాటుతూ ఉన్నతస్థాయికి చేరడం ద్వారా సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయని కుమ్మరి శాలివాహన ప్రజాపతి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుమ్మడిదల వెంకటనారాయణ తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన శాలివాహన విద్యార్థులను ఆదివారం వైరాలో సన్మానించి నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేలా కష్టపడి చదువుకోవాలని సూచించారు.


