ఏర్పాటయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

ఏర్పాటయ్యేనా?

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

అన్ని చోట్ల ఎస్‌ఐల సారథ్యంలోనే

విధులు

మూడేళ్ల క్రితం ప్రత్యేక డివిజన్‌ కోసం ప్రతిపాదనలు

పుష్కరాల సమయానికై నా

మంజూరయ్యేనా..!

పుష్కరాలొస్తున్నాయ్‌

ట్రాఫిక్‌ డివిజన్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో భారీ పరిశ్రమలు ఉండటంతో వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంటోంది. వ్యక్తిగత వాహనాలకు తోడు లారీలు, బస్సులు, ట్రక్కులు వంటి భారీ వాహనాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీంతో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్తగూడేనికి రారష్ట్‌ర ప్రభుత్వం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత భక్తులు, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే భద్రాచలంలోనూ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించింది. ఇదే ఊపులో పాల్వంచలో సైతం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేకంగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో ట్రాఫిక్‌ విభాగాన్ని నెలకొల్పింది. అయితే, పదేళ్లు గడిచినా ఇప్పటికీ ఈ విభాగంలో ఎటువంటి పురోగతీ లేదు. మరోవైపు వాహనాల రద్దీ పెరుగుతోంది.

తప్పని తిప్పలు

కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలంలో ప్రస్తుతం ట్రాఫిక్‌ విభాగాలు పని చేస్తున్నా, ఇవన్నీ కేవలం ఎస్‌ఐల నేతృత్వలో కొనసాగుతున్నాయి. పద్నాలుగు నుంచి ఇరవై మంది వరకు ఉండే సిబ్బందితో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వీఐపీ రూట్‌ క్లియరెన్స్‌, రోడ్‌ సేఫ్టీ అవగాహన, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తదితర పనులు ట్రాఫిక్‌ పోలీసులు చేయాల్సి వస్తోంది. ప్రధానంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రాఫిక్‌ చలాన్ల విధింపు, నో పార్కింగ్‌ జరిమానాలకే ఎక్కువగా పరిమతం అవుతున్నారు. ఇక రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలు, మతపరమైన వేడుకలు, పాదయాత్రలు, వీఐపీల పర్యటనలు కొనసాగినప్పుడు ట్రాఫిక్‌ను నియంత్రించడం వంటి పనులే ఎక్కువగా చేయగలుగుతున్నారు. తప్పితే, ట్రాఫిక్‌ ఫ్రీ ఫ్లో ఉండేలా చూడటం, బాటిల్‌ నెక్‌లను గుర్తించి చర్యలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ మార్గాల గుండా ట్రాఫిక్‌ మళ్లింపు వంటి పనులు చాలా తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నా కొత్తగూడెం కార్పొరేషన్‌, భద్రాచలంలో ప్రజలు అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.

పెండింగ్‌లోనే ప్రతిపాదనలు

కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లను ఒకే గొడుగు కిందకు తెస్తూ జిల్లా ట్రాఫిక్‌ పోలీసింగ్‌ డివిజన్‌ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం రాష్ట్ర పోలీస్‌ శాఖకు ప్రతిపాదనలు పంపారు. దీని ప్రకారం జిల్లా స్థాయిలో ట్రాఫిక్‌ డీఎస్పీ ఉండనుండగా, దిగువ స్థాయిలో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఏఎస్‌ఐల సంఖ్య పెరుగనుంది. ట్రాఫిక్‌ ఒత్తిడి తీవ్రత పెరిగినప్పుడు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీలవుతుంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ మెరుగవుతుంది. ఫలితంగా జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతోపాటు ఆధాత్మిక క్షేత్రమైన భద్రాచలంలో ట్రాఫిక్‌ చిక్కులు చాలా వరకు తొలగుతాయి. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ డివిజన్‌ ఫైల్‌కు మోక్షం కలిగేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది.

జిల్లాలో మూడు

ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు

జిల్లా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీలకు సరిహద్దుగా ఉంది. ఇప్పటికే జిల్లా మీదుగా ఎన్‌హెచ్‌ 30పై వేలాది వాహనాలు తిరుగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌ నుంచి ఇల్లెందు మీదుగా కొత్తగూడెం వరకు ఎన్‌హెచ్‌ 930 పీ పనులు కూడా మొదలవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వాహనాల రద్దీ కచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఇక వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు కూడా జరగబోతున్నాయి. రాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు భద్రాచలమే ప్రధాన కేంద్రంగా ఉండనుంది. దీంతో నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు జిల్లా మీదుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తరచుగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే ప్రదేశాలను గుర్తించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాటిల్‌ నెక్‌ వంటి ప్రాంతాలుగా కొత్తగూడెం రైల్వే అండర్‌ బ్రిడ్జి, కిన్నెరసాని వంతెన, భద్రాచలం టెంపుల్‌ రోడ్‌ వంటివి ఉన్నాయి. మరోవైపు ట్రాఫిక్‌ మళ్లించే ప్రత్యామ్నాయ మార్గాలను రోడ్లను సైతం విస్తరించడంపై ఇప్పటి నుంచే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement