సూపర్‌బజార్(కొత్తగూడెం): గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి ఆమె గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖల ద్వారా చేపట్టే పనులను వివరించారు. ఘాట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ, నూతన రహదారుల నిర్మాణంపై ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. భద్రాచలం దేవస్థానం ఈఓ దామోదర్ రావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు పాల్గొన్నారు.
‘భద్రగిరి మార్ట్’ స్టాల్‌ను
సందర్శించిన ట్రైకార్ జీఎం
భద్రాచలంటౌన్: హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఆర్గానిక్ మేళాలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్, మిల్లెట్ మ్యాజిక్ స్టాల్‌ను ట్రైకార్ జీఎం శంకరరావు శనివారం సందర్శించారు. గిరిజన, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఆర్గానిక్ నిత్యావసరాలు, మిల్లెట్ బిస్కెట్లు, జీసీసీ ఉత్పత్తులను పరిశీలించి కొనుగోలు చేశారు. కల్తీ లేని సహజసిద్ధ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇటువంటి మేళాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది భూదేవి, శివ, మంగవేణి, సమ్మక్క, లలిత పాల్గొన్నారు.
టెన్త్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు చేయాలి
అదనపు కలెక్టర్ వేణుగోపాల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివా రం నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఉదయం 9.30 గంట ల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 1,399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డీఈఓ బి.నాగలక్ష్మి, ఇతర అధికారులు టి.ప్రతాప్, నందయ్య, డి శ్రీనివాస్, కె.మోహన్‌రావు, ఎస్.శ్రీనివాస్, ఎండీ అలీం, ఎం.అశోక్, పీడీ కృష్టఫర్, శంభు ప్రసాద్, ఎస్ మాధవరావు పాల్గొన్నారు.
నేడు చండీ హోమం
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం చండీహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలను నమోదు చేసుకోవాలని, సంప్రదాయ దుస్తులు ధరించాలని కోరారు.
శ్రీవారికి నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలోని మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వా త స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తుల సమక్షాన నిత్యకల్యాణం నిర్వహించారు. అలాగే, పల్లకీ సేవ నిర్వహించగా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ తదితరులు పాల్గొన్నారు.


