రెండోసారి టెండర్లు | - | Sakshi
Sakshi News home page

రెండోసారి టెండర్లు

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

జూన్‌ 9 వరకు బిడ్‌ దాఖలుకు గడువు

వానాకాలంలోనే భద్రాచలం

రామాలయ అభివృద్ధి పనులు

భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయ అభివృద్ధి పనులకు అధికారులు రెండోసారి టెండర్లు పిలిచారు. రూ.200 కోట్లతో చేపట్టనున్న పనులకు గత నెల 9న టెండర్లను ఆహ్వానించి, 15 వరకు గడువు విధించారు. ఒక్క బిడ్‌ కూడా నమోదు కాకపోవడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ఇటీవల రెండోసారి టెండర్లను ఆహ్వానించారు. జూన్‌ 9వ తేదీ వరకు గడువు విధించారు. నెలన్నర రోజులు గడిచినా టెండర్‌ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం తొలుత గోదావరి ఒడ్డున సుదర్శన చక్రం ప్లాన్‌కు రూ.75 కోట్లు, ఆలయ కాంప్లెక్స్‌ విస్తరణకు రూ. 180 కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఇతర కార్యాలయాల నిర్మాణానికి రూ.96 కోట్లను ప్రకటించింది. అనంతరం ప్రణాళికలో మార్పులు చేసి కాంప్లెక్స్‌ విస్తరణకు రూ.200 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. సుదర్శన చక్రం ప్లాన్‌ను పక్కకు పెట్టి, ఇతర అభివృద్ధి పనులకు రూ.46 కోట్లకు ప్రతిపాదించిన విషయం విదితమే.

వర్షాకాలంలోనే పనులు!

జూన్‌లో టెండర్‌ ప్రక్రియ పూర్తయినా పనులు వర్షాకాలంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆల య ప్రాంగణంలో ఉన్న భవనాలను కూల్చివేసి, శిథిలాలను తొలగించే పనులకు రూ.4.97కోట్లు కేటాయించారు. టెండర్లు పిలిచారు. తొలుత ఇవే పనులు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షాలతో పాటు భద్రాచలంలో గోదావరి వరదలు వచ్చ అవకాశం ఉంది. ఆ సమయంలో కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు ఇబ్బందికరంగా ఉంటాయి. దీనికితోడు గోదావరి పుష్కరాల నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉంది.

కొనసాగుతున్న కాలయాపన..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధికి నిధులు అదిగో ఇదిగో..అంటూ పదేళ్లు కాలయాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లకు మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించింది. రూ.351 కోట్లను మూడు విడతలుగా అందించేందుకు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దీంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవస్థానం అధికారులు కసరత్తు చేపట్టారు. ఉన్నతాధికారులు హడావుడి చేయటంతో ఉపాలయంలో, ఇతర ఆళ్వార్ల మూలమూర్తుల తరలింపు కార్యక్రమం కళావాహనాన్ని గత నెల 28న నిర్వహించారు. స్వర్ణ పూత వాహనాలను, మూలమూర్తులను రంగనాయకుల గుట్టపైన రామదాసు ధ్యానమందిరంలోని బాలాలయానికి తరలించారు. లక్ష్మీ అమ్మవారి మూర్తులను అంతరాలయంలోని వెండి వాకిలి వద్ద ఉంచి పూజాదికార్యక్రమాలను చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement