పూర్తిస్థాయిలో అందేవరకు పోరాటం
● పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రూ.2 వేల కోట్లు విడుదల ● జిల్లాలో 240 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం
చుంచుపల్లి: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ పొందిన, రెగ్యులర్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల బకాయిలను విడుదల చేసింది. దీంతో ఆర్థికంగా ఊరట లభించింది. ఆర్థిక శాఖ వద్ద దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులకు మొదటి విడతగా రూ.2000 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 240 మంది ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోజనం కలిగింది. వారి ఖాతాల్లో నిధులు జమవుతున్నాయి. గ్రాట్యూటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, జీఐఎస్, ఈఎల్స్ వంటి బకా యిలు చాలా వరకు క్లియర్ కానున్నాయి. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి గ్రాట్యుటీ రూ.16 లక్షలలోపు, కమ్యూటేషన్ 40శాతం, జీపీఎఫ్, ఇతరత్రా బకా యిలు విడుదలవుతున్నాయి. జనరల్ ప్రావి డెంట్ ఫండ్ బకాయిలను 100 శాతం చెల్లించడంతో పాటు 2025 మే వరకు పెండింగ్‌లోని కమ్యూటేషన్ నిధులు కూడా సర్దుబాటు కానున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల మెడికల్, సరెండర్ లీవ్స్‌తో పాటు జీపీఎఫ్ బకాయిలు కూడా కొంతమేర చెల్లించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత రూ. 2000 కోట్లను ఇవ్వగా, మరో 4000 కోట్ల బకాయిలను త్వరలో చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. వీటికంటే ముందు గతంలో ప్రభుత్వం నెలకు రు.700 కోట్ల చొప్పున మూడు నెలల పాటు చెల్లించింది.
ఆర్థిక ఇబ్బందులతో సతమతం
జిల్లాలో 12,800 మంది ఉద్యోగులు వివిధ ప్రభు త్వ శాఖల్లో పని చేస్తున్నారు. గడిచిన నాలుగైదేళ్లుగా సుమారు 2,500 మంది ఉద్యోగ విరమణ పొందారు. 2024 నుంచి మార్చి నుంచి ఇప్పటివరకు సుమారు 240 మంది రిటైర్ అయిన ఉద్యోగులున్నారు. వీరంతా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం నిరీక్షించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో రాష్ట్రవ్యాప్తంగా 120 మందికిపైగా మృతి చెందారు. వారిలో 12 మంది జిల్లాకు చెందినవారు ఉన్నారు. 2024 మార్చి నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉండగా, రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడంతో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశ్రాంత ఉద్యోగులకు పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందే వరకు ఉద్యమం కొనసాగిస్తాం. విడతలవారీగా కాకుండా ఏకకాలంలో ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి. ఉద్యోగ విరమణ పొందినవారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం సరికాదు.
–జి.ముత్యం,
రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు


