అరవై ఏళ్లు దాటినా ఆగని తునికాకు సేకరణ
మైళ్ల దూరాన్ని లెక్కచేయని గిరిజనులు
జావతో జీవనం.. శ్రమతో మనుగడ
అరవై ఏళ్ల వయసు.. మైళ్ల దూరం నడక
తునికాకు సేకరణ కాలం వచ్చిందంటే ముసలివారు సైతం ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడరు. వయసు తెచ్చిన అలసటను పక్కనబెట్టి, చేతిలో కర్ర పట్టుకుని దట్టమైన అరణ్యాల్లోకి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్తున్నారు. తెల్లవారుజామునే మొదలయ్యే వారి ప్రయాణం.. యువతతో పోటీ పడే పట్టుదలతో సాగుతోంది. నేటి తరం యువత కొద్ది దూరం నడవడానికే వాహనాలను ఆశ్రయిస్తున్న ఈ రోజుల్లో అరవై ఏళ్లు దాడిన గిరిజన అవ్వాతాతలు నెత్తిన ఆకు మూటలను మోస్తూ కొండ కోనల్లో సాగిస్తున్న ప్రయాణాన్ని చూస్తే ఎవరికై నా ముక్కున వేలేసుకోవాల్సిందే.
చీకట్లోనే అడుగులు..
ఎండ ముదరక ముందే అడవికి వెళ్లాలనే తాపత్రయంతో పండుటాకులు తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచి జోలెలు భుజాన వేసుకుని, చీకటి వెలుతురులోనే అడవి బాట పడతారు. ఎండ ముదరకముందే ఆకులను సేకరించి ఇంటికి తిరిగి వచ్చి కాస్త సద్ది అన్నమో, జావో తాగి వెంటనే సేకరించిన ఆకులను కట్టలు కట్టే పనిలో నిమగ్నమవుతారు. ప్రతీ 50 ఆకులను ఒక కట్టగా కూర్చుని కట్టడం ఈ వయసులో వారికి నడుము నొప్పితో కూడుకున్నదైనప్పటికీ తమ కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపనతో సాయంత్రం కళ్లాల (సేకరణ కేంద్రాల) వద్దకు వెళ్లి ఆకులను అప్పగించే వరకు శ్రమిస్తూనే ఉంటారు.
శ్రమను ఓడిస్తున్న ఆహార అలవాట్లు
అరవై ఏళ్లు దాటినా అంతలా కష్టపడడానికి కారణం వారి సహజసిద్ధమైన ఆహారపు అలవాట్లే. రసాయనాలతో కూడిన నేటి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి వీరు చాలా దూరం. వేసవిలో ఒంటిని చల్లబరిచే రాగి లేదా జొన్న అంబలి, రాత్రి వండిన సద్ది అన్నం, అడవిలో సహజంగా దొరికే కందమూలాలు, నల్లజీడి పండ్లు వీరి ప్రధాన ఆహారం. దీంతో ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ భరించే పోరాట స్ఫూర్తిని వారికి అందిస్తోంది.
వీడని అడవి బంధం..
ఈ ఏజెన్సీ వృద్ధులకు అడవితో విడదీయరాని బంధం ఉంది. క్రూర జంతువుల భయం, పాములు, తేళ్ల కాటు ప్రమాదాలు పొంచి ఉన్నా.. ధైర్యంగా అడవిలోకి వెళ్తారు. వారి చేతులు ఆడుతున్నంత కాలం ఎవరిపై ఆధారపడమమని, అడవి తల్లే సాకుతుందనే ఆత్మవిశ్వాసం వారి చేతల్లో కనిపిస్తుంది. వేసవిలో వచ్చే ఈ నాలుగు డబ్బులే వారి కుటుంబ అవసరాలకు ఆసరాగా నిలుస్తున్నాయి. ప్రకృతిని నమ్ముకుని వయసును సైతం గెలిచి పోరాడుతున్న ఈ ‘పండుటాకుల’ శ్రమజీవనం నేటి సమాజానికి, ఒక గొప్ప సందేశం.
ఆకాశంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్లు కాలే ఎండలో ఒళ్లు రగిలిపోయే వడగాలులతో జనజీవనం స్తంభిస్తున్నా లెక్కచేయకుండా పచ్చాకుల కోసం పండాకుల పోరాటం ఆగడం లేదు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోనూ కరకగూడెం ఏజెన్సీ అడవుల్లోని పచ్చని తునికాకు కోసం యువతతో పోటీ పడుతూ నేటికీ అడవి బాట పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యాన వారు చేసే కష్టం, జీవనశైలి, ఐక్యత, పోరాట స్ఫూర్తి పలువురికి ఆదర్శంగా
నిలుస్తోంది. –కరకగూడెం
పచ్చాకుల కోసం..
పండుటాకుల పోరాటం


